
ప్రజాశక్తి- సీతానగరం : మండలంలో పాపమ్మవలస, నీలకంఠాపురం గ్రామాల్లో వ్యాధినిరోధక టీకా కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షెడ్యూల్ ప్రకారం టీకా అర్హులైన పిల్లలు, గర్బిణుల వివరాలు, గడువు తేదీలను ఆర్సిహెచ్ రిజిష్టర్, టీకా కార్డుల్లో పరిశీలించారు. వ్యాక్సిన్ స్థితి (వివిఎమ్), కాల పరిమితి తనిఖీ చేశారు. గ్రామంలో ఉన్న ఐదేళ్ళ లోపు పిల్లలకు సకాలంలో టీకా వేయడం జరిగిందా అని, ఎవరైనా డ్రాప్‌అవుట్స్, లెఫ్ట్ అవుట్స్ ఉంటే గుర్తించి టీకా పూర్తి చేయాలని సూచించారు. టీకాలు వేయడం పూర్తయిన వెంటనే ఆ వివరాలు యూవిన్, ఆర్‌సిహెచ్ పోర్టల్స్‌లో ఆన్‌లైన్ నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. టీకాలు వేయడం వల్ల ఉపయోగాలను తల్లిదండ్రులకు వివరించాలన్నారు. పిల్లలకు ఐరన్ సిరప్‌ను వారానికి రెండు సార్లు ఒక ఎమ్‌ఎల్ ద్రావణం చొప్పున తప్పకుండా వేయించాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో పిల్లల బరువు, ఎదుగుదల నమోదు రికార్డులు పరిశీలించారు. పిల్లలు పౌష్ఠికాహారం సరిగా తీసుకునేలా చూడాలన్నారు. శీతాకాలం కారణంగా పిల్లల్లో శ్వాస సంబంధమైన సమస్యలు గుర్తిస్తే వెంటనే తగు చికిత్స అందజేసి పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎన్‌ఎమ్‌లు చైతన్య, జయలక్ష్మి, సిహెచ్‌ఒ సంధ్యారాణి, అంగన్వాడీ సిబ్బంది సత్యవతి, శకుంతల, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.