May 14,2021 07:52

   దేశంలో కరోనా రెండవ దశ విధ్వంసం నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వయోజనులందరికీ ఉచితంగా కోవిడ్‌ టీకా ఇవ్వడం తన బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అంగీకరించాలి. 'టీకా అందరి హక్కు' అన్నది సాకారం చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తక్షణం చేపట్టాలి. దేశవ్యాప్తంగా ఉచిత, సార్వత్రిక కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించాలి. కరోనా వైరస్‌ గురించి తెలిసినప్పటి నుండీ కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం, తన బాధ్యతల్ని రాష్ట్రాలపై నెట్టేస్తూ వ్యవహరించడం వల్లనే పరిస్థితి ఇంతలా దిగజారిందన్నది కఠోర వాస్తవం. కరోనా వ్యాప్తి నిరోధానికి మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని ప్రపంచం గగ్గోలు పెడితే మోడీ సర్కారు 'నమస్తే ట్రంప్‌' నుండి ఇటీవలి 'కుంభ మేళా' వరకూ జన సమూహాలను ఆహ్వానించే నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడింది. కోవిడ్‌ నివారణ, నిరోధ చర్యలు చేపట్టడం, అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి కేంద్రీకరించడం మాని 'చప్పట్లు కొట్టండి', 'దీపాలు వెలిగించండి' అని ఉపదేశాలిచ్చింది. తొలి దశలో తీవ్రమైన కోవిడ్‌ మరణమృదంగ అనుభవం తరువాత సైతం ప్రాణ రక్షణకు అవసరమైన ఆక్సిజన్‌ ఉత్పత్తి మీదనైనా కేంద్ర సర్కారుకు తగిన ప్రణాళిక, ఆచరణ లేనందునే ఇప్పుడు ప్రతి రోజూ నాలుగు వేల మందికి పైగా మృతి చెందుతున్న దురవస్థకు దేశం చేరుకుంది. ఇంతటి విషాదకర పరిస్థితులకు కారణమైన కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పుల జాబితాకు చోటు చాలదు.
   కోవిడ్‌ బాధితుల ప్రాణాలు కాపాడడానికి ఆక్సిజన్‌, అత్యవసర మందుల సరఫరాకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నానా యాతనలు పడుతున్నాయి. ప్రజలు తమకు తామే ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లు కొనుక్కోవడం, సిలిండర్ల రీఫిల్లింగ్‌ వంటివి చేసుకుంటున్నారు. అయితే, కరోనాను కట్టడి చేయడానికి అత్యధిక ప్రజానీకానికి టీకా వేయడమే పరిష్కారం. ఈ పని కేంద్ర ప్రభుత్వం వల్లనే జరగాలి. కేంద్ర ప్రభుత్వం 45 ఏళ్లు పైబడినవారికి ఉచిత టీకా ఇస్తుందనీ, మిగిలినవారు రాష్ట్ర ప్రభుత్వాలు, లేదా ప్రైవేటువారి నుండి పొందాలని, అందుకు మూడు రకాల ధరలను నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లోపభూయిష్ట విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. సార్వత్రిక, ఉచిత టీకాను అందించడం తన బాధ్యతగా ప్రకటించాలి. ఇందుకోసం సంపన్న దేశాల వద్ద వారి అవసరానికి మించి ఉన్న వ్యాక్సిన్లను సేకరించడం కోసం అన్ని రకాల దౌత్య చర్యలను వెంటనే ప్రారంభించాలి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఔషధ ప్రయోగ పరీక్షల్లో నిగ్గుదేలిన వ్యాక్సిన్లను దేశం లోకి భారతీయ నిబంధనల మేరకు అనుమతించాలి. దేశీయంగా ఐసిఎంఆర్‌, ఎన్‌ఐవి అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ ఉత్పత్తికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ల్యాబ్‌లకు అనుమతివ్వాలి. అలా చేస్తే ఏడాది లోనే అన్ని రకాల వ్యాక్సిన్‌లూ కలిపి 400 కోట్ల డోసులను దేశీయంగానే తయారుచేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు (దేశంలోని వయోజనులందరికీ పూర్తి స్థాయి వ్యాక్సినేషన్‌కు 200 కోట్ల డోసులు చాలు). పేటెంట్‌ హక్కుల మినహాయింపును సాధిస్తే మరిన్ని అవకాశాలు పెరుగుతాయి. ఇలా మనకున్న అన్ని అవకాశాలనూ వినియోగం లోకి తేవడానికి కేంద్రం పూనుకోవాలి.
   'అన్ని దారులూ రోమ్‌ నగరం వైపే' అన్న రీతిలో సకల వనరులను కోవిడ్‌ కట్టడి పైనే కేంద్రం కేంద్రీకరించడం నేటి అవసరం. వ్యాక్సిన్ల కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ. 35 వేల కోట్లను వెంటనే ఖర్చు చేయాలి. ఇప్పుడు ఏమాత్రం అవసరంలేని సెంట్రల్‌ విస్టా నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసి ఆ డబ్బుతో ఆక్సిజన్‌, వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలి. జవాబుదారీతనం లేని ప్రైవేటు ట్రస్టు నిధి, పి.ఎం కేర్స్‌లో వున్న ధనాన్నంతా విడుదల చేసి మరిన్ని వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌, అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయడం సబబుగా ఉంటుంది. కేంద్ర గోదాముల్లో ప్రస్తుతం కోటి టన్నులకు పైగా ఆహార ధాన్యాలు ముక్కిపోతున్నందున అవసరమైన వారికి వాటిని ఉచితంగా పంపిణీ చేయాలి. ఉపాధి కోల్పోయిన ప్రజలకు, నిరుద్యోగులకూ జీవన భృతి కల్పించడం కేంద్ర ప్రభుత్వ కర్తవ్యం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి కోవిడ్‌ కట్టడికి తగు చర్యలు చేపడుతుందని ఆశించవచ్చా?