Mar 11,2023 00:22

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంపిపి కారం లక్ష్మి

ప్రజాశక్తి- విఆర్‌.పురం
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ కాకుండానే, ఈ విద్యాసంవత్సరం పూర్తి కావస్తుందని, అలాంటప్పుడు విద్యార్థుల ఉత్తీర్ణత ఎలా సాధ్యపడుతుందని ఎంపిపి కారం లక్ష్మి ప్రశ్నించారు. మండలంలోని సోములు గూడెం బాలికల ఆశ్రమ పాఠశాలను శుక్రవారం ఎంపిపి లక్ష్మి, సిపిఎం నాయకులు సందర్శించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆమె మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 308 విద్యార్థులకు గాను, ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారని, ఫిజిక్స్‌, సోషల్‌, ఇంగ్లీష్‌, సైన్స్‌ బోధించేందుకు ఉపాధ్యాయులు లేరని హెచ్‌ఎం వివరించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల చదువుల పట్ల శ్రద్ధ వహించడం లేదని పేర్కొన్నారు. అనంతరం చింతరేవుపల్లి, కన్నాయిగూడెం, తృష్టివారిగూడెం పాఠశాలలను ఎంపిపి సందర్శించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల్లోనూ ఉపాధ్యాయుల కొరత ఉందటాన్ని ఆమె గుర్తించారు. తక్షణమే ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఎంపిపి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామగిరి సర్పంచ్‌ పులి సంతోష్‌ కుమార్‌, సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి చిన్నబాబు, నాయకులు పంకు సత్తిబాబు, వడ్లది రమేష్‌, నాగిరెడ్డి పాల్గొన్నారు.