Apr 18,2021 06:29

పాఠశాల విద్య ఎప్పుడూ టీచర్ల కొరతతోనే నడుస్తోంది. సంవత్సరాల తరబడి ఖాళీలు ఖాళీలుగానే ఉంటున్నాయి. పాలకులు, పార్టీలు ఏవైనా 'ప్రతి ఏటా డియస్సీ'ని మాత్రం అమలు చేయడం లేదు. వేల సంఖ్యలో ఖాళీలు పేరుకుపోయిన తర్వాత డియస్సీలు వేయడం, కోర్టు వాయిదాలతో కాలం గడిచిపోవడం జరుగుతోంది. గత డియస్సీలు ఏవీ షెడ్యుల్‌ ప్రకారం సకాలంలో అమలు కాలేదు. 2018 డియస్సీ వారికి 2020లో నియామకాలు చేశారు. ఈ డియస్సీకి సంబంధించి తెలుగు పండిట్ల నియామకాలు ఇప్పటికీ కోర్టు కేసులతో పెండింగ్‌లో ఉన్నాయి. 2018 డియస్సీ అమలుగాక 2019, 2020 విద్యా సంవత్సరాలు టీచర్లు లేకుండానే గడిచిపోయాయి.

రాష్ట్ర విభజన తర్వాత తూర్పు, పశ్చిమ గోదావరి ఏజన్సీ విలీన మండలాలలో టీచర్లందరూ తెలంగాణకు వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో ఏజన్సీలో స్పెషల్‌ డియస్సీ వేయాలని పట్టుబట్టినా, పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మైదాన ప్రాంత ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌ మీద వేసి పాఠశాలలు నడిపారు. రెండు చోట్లా విద్యా ప్రమాణాలు దెబ్బ తిన్నాయి. కనీసం అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను అయినా ఇవ్వాలని డిమాండ్‌ చేసినా బడ్జెట్‌ మంజూరు చేయలేదు.

రాష్ట్రంలో 30,532 ప్రాథమిక పాఠశాలల్లో 7,774 ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఇద్దరు టీచర్లున్న పాఠశాలలు 18,024 వున్నాయి. అంటే 30,532 పాఠశాలల్లో 25,798 పాఠశాలలు...ఒకరు, ఇద్దరు ఉపాధ్యాయులతో మాత్రమే నడుస్తున్నాయి. దీన్నిబట్టి మన పాఠశాలల్లో ప్రాథమిక విద్య ఎట్లా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల బదిలీల తర్వాత మోడల్‌ ప్రైమరీ స్కూళ్ళల్లో, ఇతర పాఠశాలల్లో పోస్టులు తగ్గించి ఒకరు, ఇద్దరు పని చేస్తున్న పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు సర్దుబాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉపాధ్యాయులు ప్రతి రోజు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని యాప్‌ల ద్వారా పంపించే పనిలో కూరుకుపోతుంటే...ఇక నాణ్యమైన విద్య ఎలా అందుతుందో ఆలోచించాలి. విద్యాశాఖ అధికారులు విద్యా ప్రమాణాల గురించి అడగడం మానేసి యాప్‌ల ద్వారా సమాచారం పంపించారా లేదా అని అడుగుతున్నారు. ప్రభుత్వం తక్షణం ఈ పరిస్థితిని చక్కదిద్దాలి.

ఖాళీలతో వేల కోట్లు మిగుల్చుకుంటున్న ప్రభుత్వం
ప్రస్తుతం పాఠశాల విద్యలో 25 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కరోనా కారణంగా ప్రైవేట్‌ పాఠశాలల మూత, నాడు-నేడు, ప్రభుత్వ పథకాల వలన ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు పెరిగారు. పెరిగిన విద్యార్థులను కూడా లెక్కిస్తే ఉపాధ్యాయ ఖాళీలు 30 వేల పైనే ఉన్నట్లు తెలుస్తుంది. ఎ.పి రెసిడెన్షియల్‌, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మోడల్‌ స్కూళ్లు, పాఠశాలల్లో వేలాది పోస్టుల్లో నేటికీ సిఆర్‌టి లుగా, గెస్టు ఫ్యాకల్టీలుగా పని చేస్తున్నారు. రెగ్యులర్‌ వేకెన్సీలలో పని చేస్తున్న వీరిని రెగ్యులర్‌ చేస్తేనే ఈ ఖాళీలు భర్తీ చేసినట్లు భావించాలి. గెజిటెడ్‌ హెడ్‌ మాస్టర్లు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల అప్‌గ్రెడేషన్‌, పండిట్‌, పిఇటి పోస్టుల అప్‌గ్రెడేషన్‌ కోసం వేలాది ఎస్‌జిటి పోస్టులను గత 20 ఏళ్లుగా సప్రెస్‌ చేస్తూ వచ్చారు. దీంతో ప్రస్తుతం 30 వేల పాఠశాలలకు 75 వేల ఎస్‌జిటి పోస్టులు మాత్రమే ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పోస్టులు లేవనే పేరుతో ఈ సంవత్సరం ప్రభుత్వం మోడల్‌ ప్రైమరీ స్కూళ్ళ కోసం 2017 నుండి అమలు చేసిన స్టాఫ్‌ ప్యాట్రన్‌ మార్చేసి విద్యా హక్కు చట్టం ప్రకారం పోస్టులు తగ్గించి రీఅపార్షన్‌మెంట్‌ చేశారు. దీనివల్ల ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న పోస్టులు తగ్గించారు. ప్రస్తుతం వేల పాఠశాలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. 100-150-180 విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్న పాఠశాలలు ఉన్నాయి.

మున్సిపల్‌ పాఠశాల ఖాళీలు
కరోనా కాలంలో మున్సిపల్‌ పాఠశాలల్లో ప్రవేశాలు విపరీతంగా పెరిగాయి. మున్సిపల్‌ పాఠశాలలు ఎక్కడ చూసినా తరగతి గదులు సరిపోని పరిస్థితి ఉంది. సెక్షన్‌కు 150-200 మంది విద్యార్థులతో నడుస్తున్న పాఠశాలలున్నాయి. ఒకవైపు ఖాళీ పోస్టులు భర్తీ కాక, మరోవైపు పిల్లల సంఖ్య పెరగడంతో ఉన్న ఉపాధ్యాయులపై పని భారం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం మున్సిపల్‌ పాఠశాలల్లో ఉన్న పిల్లలకు ఉన్న ఉపాధ్యాయులు కంటే రెట్టింపు ఉపాధ్యాయులు కావాల్సి ఉంది.

ఉపాధ్యాయుల ఖాళీలను సంవత్సరాల తరబడి భర్తీ చేయకుండా ప్రభుత్వం బడ్జెట్‌ ఎలా మిగుల్చుకుంటుందో చూద్దాం. ప్రభుత్వ లెక్కల ప్రకారం 20 వేల వేకెన్సీలు వున్నాయనుకుంటే...నెలకు 20,000 శ రూ.41,000 (సరాసరి వేతనం) నెలకు రూ. 82 కోట్లు, సంవత్సరానికి రూ. 984 కోట్ల బడ్జెట్‌ మిగుల్చుకొంటుంది. 30 వేల ఖాళీలు అనుకుంటే జీతాల కోసం సంవత్సరానికి రూ.1500 కోట్లు ఖర్చు చేయాలి. ఇన్ని కోట్లు మిగుల్చుకొంటున్న ప్రభుత్వం ఈ ఖాళీలన్నింట్లో రూ. 10 వేల జీతంతో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను తక్షణం నియమించాలని కోరుతున్నాం. దీనికి బడ్జెట్‌ లేదని తప్పించుకోవడంలో నిజాయితీ ఏముంది?

352 కస్తూరి బా పాఠశాలల్లో 3500 కాంట్రాక్ట్‌ టీచర్లు, 3500 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పని చేస్తున్నారు. నేటికి రెగ్యులర్‌ పోస్టులు ఒక్కటి కూడా ఈ పాఠశాలలకు మంజూరు చేయలేదు. ఈ పాఠశాలల్లో రెగ్యులర్‌ పోస్టులు మంజూరు చేసి అక్కడ పని చేస్తున్నవారిని రెగ్యులర్‌ చేయాలి.

పూర్తి స్థాయి డియస్సీ
ప్రభుత్వం 'నాడు-నేడు' మొదటి దశ పనులతో వేల ప్రభుత్వ పాఠశాలల మౌళిక సదుపాయాలను మెరుగుపరచడం అభినందనీయం. దీనితోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ఉంది. ఖాళీ పోస్టులు భర్తీ చేయకుంటే నాణ్యమైన విద్య అందించడం సాధ్యం కాదు. ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన రిపోర్టుల బాధ్యత బోధనా సమయం మొత్తాన్ని హరించి వేస్తున్నది. ఈ భారం తొలగించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ద్వారానే పెరిగిన విద్యార్థులను నిలుపుకోగలుగుతాం. కావున 2021 డియస్సీని పూర్తిస్థాయి డియస్సీగా ప్రకటించి తక్షణం షెడ్యూల్‌ ప్రకటించాలి. ఈలోగా ఖాళీలన్నింటిని అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లతో భర్తీ చేయాలి.
                                         * ఐ. వెంకటేశ్వరరావు /వ్యాసకర్త పిడియఫ్‌ ఎమ్మెల్సీ/