Apr 26,2023 23:59

విశాఖపట్నం స్పాట్‌ కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-అనకాపల్లి
రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉపాధ్యాయులను భయబ్రాంతులకు గురి చేయడం తగదని ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ గొంది చిన్నబ్బాయి అన్నారు. స్థానిక స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రం వద్ద బుధవారం భోజన విరామ సమయంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవీణ్‌ ప్రకాష్‌ రాష్ట్రమంతా పర్యటిస్తూ ఎక్కడికక్కడ అధికారులను, ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ లోపాలను ఉపాధ్యాయులపై నెట్టి వేయడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వం సకాలంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకుండా, ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులు, అధికారులపై నెట్టడంతో ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇచ్చిన నెలలోనే జగనన్న స్కూల్‌ బ్యాగులు చినిగిపోయాయని, పాదరక్షలు సరైన కొలతలతో రాలేదని, ఈ విషయంలో ప్రవీణ్‌ ప్రకాష్‌ ఎవరిని శిక్షిస్తారని ప్రశ్నించారు. ప్రవీణ్‌ ప్రకాష్‌ తీరు మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి వై.సుధాకర్‌ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పట్ల కక్ష సాధింపు ధోరణి విడనాడాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో కో చైర్మన్‌ సాయికుమార్‌, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ ఎన్‌ సన్యాసినాయుడు, కే రమణాజీ, కోశాధికారి కె.పరదేశి, కార్యవర్గ సభ్యులు ఎం శ్రీనివాసరాజు, కే రాజు, సీనియర్‌ నాయకులు జి మధు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌, విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పాఠశాలల పర్యవేక్షణ సందర్భంగా ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ క్వీన్‌ మేరీ పాఠశాలలో స్పాట్‌కు హాజరైన ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండించారు. ప్రిన్సిపల్‌ కార్యదర్శి వ్యవహార శైలిని తప్పుపడుతూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి నాగేశ్వరరావు, ఎపిటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, టి.రామకృష్ణ, డిటిఎఫ్‌ కో- చైర్మన్‌ ఎ.ధర్మేందర్‌రెడ్డి, ఎస్‌టియు డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ ఐవి రామిరెడ్డి, ఫ్యాప్టో కార్యదర్శి ఎం.కృష్ణ నాయకత్వం వహించారు.