Nov 07,2023 21:22

సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు కిమిడి నాగార్జున

ప్రజాశక్తి-విజయనగరంకోట :   రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి జరుగుతోందని టిడిపి విజయనగరం పార్లమెంట్‌ స్థానం అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయం అశోక్‌ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీచర్ల బదిలీల కోసం గతంలో రాజకీయ నాయకుల చుట్టూ తిప్పుకునే సంస్కతి ఉండేదని, ఈ పక్రియకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు కౌన్సిలింగ్‌ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. గత ప్రభుత్వంలో నిజాయతీగా బదిలీ పక్రియ జరుగుతుండేం దన్నారు. ఇప్పడు బొత్స విద్యాశాఖ మంత్రి అయిన తరువాత ఈ సిస్టమ్‌ను మార్చేసి అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. వారికి కావాల్సిన మనుషులకు నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేస్తున్నారని మండిపడ్డారు. బదిలీలు కోసం రూ.2లక్షలు నుంచి రూ.5లక్షలు వరకు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మంత్రి బొత్స విద్యాశాఖను అవినీతి మయం చేస్తున్నారని విమర్శించారు. అనేక ఆరోపణలు వస్తున్నా వాటిపై బొత్స ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. విద్యా కానుక కిట్‌లలో కూడా భారీ అవినీతి జరుగుతోందన్నారు. అవసరం లేకున్నా అదనంగా లక్షా 70 వేల కిట్‌లు ఎందుకు కొన్నారన్నారు. విద్యా కానుక కిట్‌లు బాగోలేవని చెప్పినా కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యాహ్నం భోజనం పథకంలో ఇచ్చే చెక్కీలు కూడా టెండర్‌ లేకుండా పాత కాంట్రాక్టర్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ బొత్స సమాధానం చెప్పాలన్నారు.
సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, నాయకులు గంటా పోలి నాయుడు, కర్రోతు నర్సింగరావు, శ్రీనివాసరావు, కంది మురళి నాయుడు, కనకల మురళీ మోహన్‌ పాల్గొన్నారు.