
ప్రజాశక్తి - జామి : బడికి వెళ్తున్న సమయంలో ఓ ఉపాధ్యాయని మెడలో బంగారు గొలుసును చోరీ చేసిన సంఘటన జామి మండలంలో కలకలం రేపింది. శుక్రవారం మండలంలోని లొట్లపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యా యులుగా పనిచేస్తున్న కె.అరుణ కుమారి విజయనగరంలో నివాసముంటున్నారు. రోజూ మాదిరిగా ఉదయం పాఠశాలకు ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. అలమండ సంత సమీపంలోని సింగారం జంక్షన్ వద్ద వెనుక నుంచి బైక్‌పై మాస్కులు పెట్టుకొని వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో 2 తులాల బంగారు గొలుసును తెంపేసి, పరారయ్యారు. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన వారు అక్కడ నుంచి భీమసింగి వైపు వెళ్లినట్లు ఆమె తెలిపారు. నలుపురంగు పల్సర్ బైక్‌పై వచ్చారని, నంబర్ ప్లేట్ లేదని ఆమె వివరించారు. ఎస్‌ఐ వీరబాబు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.