Apr 28,2023 23:47

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఆస్తి విలువ ఆధారంగా పన్నులు నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభావం క్రమంగా ప్రజలకు అర్ధం అవుతోంది. పెంపుదల భారం భారీగా కొనసాగుతోంది. పైసల్లో మాత్రమే పెంచుతున్నామని దీనికి ఇంత రాద్ధాంతం అవసరమా అని ఆస్తి పన్ను పెంపు సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యలు చేశారు. నూతన విధానం కేవలం ఒక్క ఏడాది మాత్రమేనని 2021లో పన్నుల పెంపుపై ప్రతిపక్షాలు ఆందోళన చేసిన సమయంలో అప్పటి మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం ఏటా 10-15 శాతం పెంచుతున్నారని తెలిసి ప్రజలు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిట్టుకుంటూనే పన్నులు చెల్లిస్తున్నారు.
2021 మార్చి ముందు అద్దె ఆధారంగా పన్ను ఆస్తి పన్ను నిర్ధారించే వారు. వైసిపి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 2021-22 నుంచి ఆస్తి విలువ ఆధారంగా పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. తొలుత కేవలం 0.15 శాతం మాత్రమే పన్నులు పెంచుతున్నామని అధికారులు నగర పాలక సంస్థ సమావేశంలో వెల్లడించారు. కానీ గత మూడేళ్లలో 10-15 శాతం పెంపుదలతో డిమాండ్‌ నోటీసులు వస్తుండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిఏటా ఈ పెంపుదల ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ ఆస్తులు మినహాయించి 2021-22లో గుంటూరు నగర పాలక సంస్థకు రూ.93 కోట్ల డిమాండ్‌ ఉండగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.99 కోట్ల పెరిగింది. 2022-23 సంవత్సరంలో రూ.106 కోట్లకు పెరిగింది. 2023-24లో రూ.115 కోట్లకు చేరింది. పాత బకాయిలు కలిపి 2023-24లో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.138 కోట్లకు పెరిగింది. 2023 మార్చి నాటికి బకాయిలు చెల్లిస్తే వడ్డీ రద్దు చేస్తామని ప్రకటించడంతో రూ.118 కోట్లు వసూలయ్యాయి. వడ్డీ రాయితీ మినహాయింపుతో చాలా మంది బకాయిలు మొత్తం చెల్లించేశారు.
తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ 30 తేదీలోపు ఈ సంవత్సరానికి సంబంధించిన పన్నులను ముందస్తుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ వస్తుందని ప్రకటించి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ప్రస్తుత ఏడాది పన్ను చెల్లింపునకు వచ్చే మార్చి వరకు గడువున్నా ఐదు శాతం రాయితీ ఇవ్వడం వల్ల గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టుగా 15 శాతం పెంపులో ఐదు శాతం తగ్గినా తగినట్టేనని కొంత మంది ముందుకు వస్తున్నారు. ముందస్తు చెల్లింపుదారుల్ల ధనికులు, ఎగువ మధ్య తరగతి వారు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ ముందస్తు వసూలు లక్ష్యం రూ.50 కోట్లు కాగా గత 28 రోజుల్లో రూ.42 కోట్ల వరకూ వసూలు చేయగలిగారు. చివరి రెండ్రోజుల్లో మరో రూ.3 కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు.