ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : రూ.80 కోట్లతో పట్టణ ప్రజల అవసరార్థం నిర్మించనున్న టిడ్కో గృహ సముదాయాలకు రూ.12 కోట్లతో భారీ మంచినీటి సరఫరా పథకం అందుబాటులోకి రానుందని, దీనివల్ల పట్టణానికి తాగునీటి కొరత తీరనున్నట్లు రాష్ట్రటిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ప్రాజెక్టుకు సంబంధించి స్థల పరిశీలన చేశారు. అనంతరం అడ్డాపుశీలలో నిర్మాణం చేపట్టిన టిడ్కో హౌసింగ్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించి ఆయా గృహ సముదాయాలకు శాశ్వత ప్రాతిపదికన మంచి నీటి సరఫరా అందించేలా చేయబోవు కార్యాచరణ గురించి అధికారులతో చర్చించారు. ప్రస్తుతం నీటి లభ్యత కొరత కారణంగా రెండు రోజులకు ఒకసారి నీరందిస్తున్న సమస్య నుంచి ప్రతిరోజూ నీరివ్వడానికి ప్రణాళిక తోటపల్లి ఇరిగేషన్ అధికారులు నుంచి అనుమతి లభించిన దరిమిలా పబ్లిక్ హెల్త్, టిడ్కో సంయుక్తంగా రూ.12 కోట్లతో పథకాన్ని చేపడుతున్నామని తెలిపారు. దీని ద్వారా కనీసం 50లక్షల లీటర్ల నీరు లభ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో టిడ్కో ఎస్‌ఇ డి.నరసింహమూర్తి, పబ్లిక్ హెల్త్ ఇఇలు దక్షిణ మూర్తి, జ్యోతి, డిఇఇ బాలకృష్ణ, మున్సిపల్ ఇంజనీర్లు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ సిబ్బంది మరియు స్థానిక నాయకులూ ప్రజలు పాల్గొనడం జరిగింది.










