
మున్సిపాలిటీలో నిరుపేద, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లకు మోక్షం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. అపార్ట్‌మెంట్ రూపంలో నిర్మించిన ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. కానీ వాటికి విద్యుత్తు, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత వెంటాడుతోంది. టిడిపి ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణం ఇంతవరకు నత్తనడకన సాగింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టరును మార్చడంతో ఇళ్ల నిర్మాణం బాగా ఆలస్యమైంది.
ప్రజాశక్తి-సాలూరు : సాలూరు పట్టణానికి సమీపంలో చంద్రప్పవలస వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సుమారు 1400 ఫ్లాట్లను నిర్మించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఇళ్ల లబ్ధిదారుల నుంచి నామమాత్రపు డబ్బులు వసూలు చేసి వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని భావించింది. అయితే వైసిపి ప్రభుత్వం డబ్బులు తీసుకోకుండా ఒక రూపాయితో ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. అంటే దాదాపు ఉచితంగానే లబ్దిదారులకు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆచరణలో మాత్రం నత్తనడకన సాగుతోంది. దీంతో లబ్దిదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండేళ్లుగా లబ్దిదారులకు ఇళ్ల అప్పగింత కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. కొద్దినెలల క్రితం టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి వినాయక చవితికి లబ్దిదారులకు అప్పగిస్తామని చెప్పారు. దసరా కూడా వెళ్లిపోయింది. సంక్రాంతి లోపు అయినా అప్పగిస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిధుల కొరత
టిడ్కో ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు కొరత వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల మంజూరు కావాల్సి ఉంది. ఈ మేరకు డిప్యూటీ సిఎం రాజన్నదొర తన నివాసంలో టిడ్కో ఇళ్లపై సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. విద్యుత్తు సరఫరాకి సంబంధించి 3.17 కోట్ల రూపాయల నిధులు అవసరమని అధికారులు చెబుతున్నారు. 26 బ్లాకుల్లో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు కోసం నిధులు చెల్లించాలని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ఒక్కో బ్లాక్‌కి ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ అవసరమని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ప్రతిపాదనలను టిడ్కో అధికారులకు అందజేశారు. అయితే ఆ నిధులు మంజూరులో ప్రభుత్వం జాప్యం కారణంగా విద్యుద్దీకరణ పనులు జాప్యమవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
నిధులు మంజూరు చేయిస్తా
టిడ్కో ఇళ్లకు విద్యుద్దీకరణ పనుల కోసం అవసరమైన నిధులు మంజూరుపై సిఎం జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడుతా. త్వరలో కలిసి నిధులు మంజూరు చేయిస్తా.
- రాజన్నదొర, డిప్యూటీ సిఎం
డిసెంబర్‌కి అప్పగింత
టిడ్కో ఇళ్ళ అప్పగింత కార్యక్రమం డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. విద్యుద్దీకరణ పనులు చేపట్టాలి. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
- జ్యోతి, టిడ్కో ఇఇ