ప్రజాశక్తి - ఏలూరు టౌన్
నగరపాల సంస్థ పరిధిలోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు త్వరితగతిన రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని నగర కమిషనర్ షేక్ షాహిద్ పేర్కొన్నారు. కమిషనర్ ఛాంబర్లో మంగళవారం బ్యాంకు ప్రతినిధులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోణంగి ప్రాంతంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం 80 శాతం పూర్తయిందన్నారు. ఎంఎల్‌ఎ ఆళ్ల నాని ఆదేశాల మేరకు టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. 'ఎ' కేటగిరిలోని లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. 'బి' కేటగిరిలో 384 మంది, 'సి' కేటగిరిలో 720 మంది లబ్ధిదారులున్నారన్నారు. మిగిలిన ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి తమవంతు బాధ్యతగా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. అర్హులైన జగనన్న తోడు లబ్ధిదారులకు రుణాల మంజూరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కమిషనర్ బ్యాంకర్లకు సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ ఎన్‌వి.బాపిరాజు, జిల్లా టిడ్కో ప్రాజెక్ట్ ఆఫీసర్ స్వామి నాయుడు, ఫైనాన్షియల్ కో ఆర్డినేటర్ సుందర్‌రావు, మెప్మా పీడీ ఇమ్మానియేలు, ఎస్‌బిఐ, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు, పలు బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.










