Jan 18,2023 23:07

ప్రజాశక్తి-భవానీపురం
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. విద్యాధరపురంలోని చెరువు సెంటర్‌లో బుధవారం టిడ్కో ఇళ్ల లబ్దిదారులతో సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లను విజయవాడ నగరంలో 20 వేల మందికి మంజూరు చేసినట్లు చెప్పి 11 వేల మందితో డిపాజిట్లు కట్టించుకున్నారని చెప్పారు. కొంత మంది వద్ద రూ.25 వేలు, మరికొంత మంది వద్ద రూ.50 వేలు కట్టించుకున్నారని తెలిపారు. ఇళ్లు కట్టింది కేవలం 6,756 మందికి మాత్రమేనన్నారు. వెలంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు చంద్రబాబును, పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించటానికి తప్ప పని చేయడంలో శ్రద్ధ లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా డిప్యూటీ సెక్రటరీ దోనేపూడి శంకర్‌, విజయవాడ నగర సహాయ కార్యదర్శులు లంక దుర్గారావు, నక్కా వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు తాడి పైడియ్య, పంచదార్ల దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న ఉద్యమాల కోసం బెజవాడ రాజరావు హైస్కూల్‌ కరస్పాండెంట్‌ రూ.5 వేలు విరాళాన్ని చెక్కు రూపంలో రామకృష్ణకు అందజేశారు. ఆయన వెంట స్కూల్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి బెజవాడ శ్యామ్‌ప్రకాష్‌ ఉన్నారు.