
ప్రజాశక్తి - పాలకొల్లు
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు అండగా ఉంటామని ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు తెలిపారు. వైసిపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం పట్టణంలోని మెయిన్ రోడ్డులో దుకాణాదారుల వద్దకెళ్లి మహిళా లబ్ధిదారులు, టిడిపి శ్రేణులతో కలిసి ఎంఎల్‌ఎ నిమ్మల భిక్షాటన చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దుకాణదారులతోపాటు రహదారి వెంబడి చిన్నపాటి వ్యాపారులు నిరసనకు సంఘీభావం తెలిపారు. జగన్ ప్రభుత్వం ఇళ్ల పేరుతో పేదలు, మహిళలను మోసం చేసిందని, ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఈ నెల 15వ తేదీన తలపెట్టిన పాలకొల్లు చూడు, వంటా వార్పు, బహిరంగ సభకు లబ్ధిదారులు తరలిరావాలని ఎంఎల్‌ఎ కోరారు. పదో వార్డులో నడిరోడ్డుపై శుక్రవారం రాత్రి బసచేసిన ఆయన శనివారం ఉదయం అక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర 19వ వార్డు వరకూ సాగింది. రాత్రి 18వ వార్డు టిడ్కో ఇంటి లబ్ధిదారుల ఇళ్ల వద్ద నడిరోడ్డు పైనే బసచేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ పాలకొల్లులో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఇంటి అద్దెలు, బ్యాంకు వాయిదాలు చెల్లించలేక భిక్షాటన చేసుకునే పరిస్థితిని జగన్ ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. టిడ్కో గృహాల పేరుతో మోసపోయిన మహిళలకు న్యాయం జరిగేలా ఈనెల 15న వినూత్న నిరసనలో వంటావార్పు, బహిరంగ సభకు పెద్ద ఎత్తున లబ్ధిదారులు కుటుంబాలతో కలిసి నిర్వహిస్తున్నామన్నారు. నా ఇల్లు నా సొంతం ప్రజా ఉద్యమం ద్వారా జగన్ ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. ప్రభుత్వం లబ్ధిదారులందరికీ రుణభారం లేకుండా ఉచితంగా ఇళ్లు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలను నివాస ప్రాంతాల్లోనే ఇవ్వాలని ఎంఎల్‌ఎ డిమాండ్ చేశారు.