ప్రజాశక్తి - ఏలూరు టౌన్
అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి తక్షణం అందించాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాలైనా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇళ్లు అందజేయకపోవడం దుర్మార్గమని విమర్శించారు. జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 90 శాతం ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేశారని, అనంతరం ఎన్నికలు జరిగి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, ఎఐటియుసి నాయకులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ టిడ్కో గృహ సముదాయాల వద్ద మౌలిక వసతులు కల్పించి, ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సమితి సభ్యులు పుప్పాల కన్నబాబు, బళ్ల కనకదుర్గారావు, మావూరి విజయ, కొల్లూరి సుధారాణి, అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా పాల్గొన్నారు.










