ప్రజాశక్తి - పెద్దాపురం పెద్దాపురం-వాలుతిమ్మాపురం రహదారిలోని టిడ్కో గృహ సముదాయంలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆ కాలనీ ప్రజలు బుధవారం కాలనీలోని టిడ్కో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడుతూ ఈ కాలనీలో లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అపార్ట్మెంట్లు అప్పగించ లేదన్నారు. అపార్ట్మెంట్లు అప్పగించిన వారిలో కొన్ని కుటుంబాల వారు ఈ కాలనీలో నివసిస్తున్నారన్నారు. ఈ కాలనీలో మంచినీటి సరఫరా బోర్లు ఐదు ఉన్నాయని, కానీ ఒక్కటే పని చేస్తోదని చెప్పారు. ఈ బోరును ఆపరేట్ చేసేందుకు వర్కర్‌ను కూడా నియమించ లేదన్నారు. దీంతో కాలనీవాసులు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కాలనీలో వీధిలైట్లు కూడా వెలగడం లేదన్నారు. చుట్టూ పొలాల మధ్య ఈ కాలనీ నిర్మించడం వల్ల చీకటి పడితే పాములు సంచరిస్తున్నాయన్నారు. కాలనీవాసులు పెన్షన్ కోసం, రేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తోందన్నారు. వీరికి ఈ సదుపాయాలన్నీ కాలనీలోనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ గృహ సముదాయాన్ని టిడ్కో తమకు ఇంకా అప్పగించలేనందున సమస్యల పరిష్కారం తమకు సంబంధం లేదని మున్సిపాలిటీ వారు అంటుంటే టిడ్కో అధికారులు మాత్రం ఈ కాలనీని మున్సిపల్ అధికారులకు అప్పగించామని చెబుతున్నారన్నారు. మున్సిపాలిటీ, టిడ్కో మధ్యలో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారన్నారు. టిట్కో అసిస్టెంట్ ఇంజనీర్ సుధాకర్ ధర్నా వద్దకు వచ్చి మంచినీటి సమస్య పరిష్కారానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు సిరపరపు శ్రీనివాస్, గడిగట్ల సత్తిబాబు, దారపురెడ్డి కృష్ణ, అరుణ్, క్రాంతి కుమార్, సన్యాసిరావు, నాగమణి, శివ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










