Apr 26,2023 01:27
టిడ్కో గృహాల నిర్మాణ పనులపై అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: టిడ్కో గృహాలు వేగంగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు పి రంజిత్‌ బాషా ఆదేశించారు. టిడ్కో గృహ నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం ఆయన తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పేద ప్రజల కోసం నిర్మించతలపెట్టిన టిడ్కో గృహాలను విధించిన గడువులోగా పూర్తిచేయాలని కలెక్టరు కోరారు. బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి పట్టణంలో 960 గృహాలు నిర్మిస్తుండగా, రేపల్లె పట్టణంలో 1,344 గృహ నిర్మాణాలు వివిధ స్థాయిలో నిలిచిపోయాయని టిడ్కో అధికారులు కలెక్టరుకు వివరించారు. రేపల్లె పట్టణంలో ఎస్‌పిసిఎల్‌ కంపెనీ నిర్మిస్తుండగా రూ.120 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉండడంపై కలెక్టరు ఆరా తీశారు. అద్దంకి పట్టణంలో ఎల్‌అండ్‌టి కంపెనీ ఎజెన్సీగా వ్యవహరిస్తుందని, ఆ సంస్థకు రూ.100 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం సంబంధిత ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసినప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. తదుపరి సమావేశానికి ఏజెన్సీల ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. టిడ్కో గృహాలను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిర్మించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. అద్దంకి పట్టణం మూర్జువారిపాలెంలో 1.5 ఎకరా భూమి కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అలాగే గుంజువారిపాలెంలో మరో 3 ఎకరాల భూమి సేకరించాలని కలెక్టరు చెప్పారు. భూసేకరణ కోసం అవసరమైన రూ.45 లక్షల నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. పట్టణ ప్రాంతాలలోని జగనన్న కాలనీలలో చేపట్టిన గృహనిర్మాణాలు 3 నెలలలోగా పూర్తి చేయాలని కలెక్టరు ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ పనిచేయాలని ఆయన సూచించారు. సమావేశంలో టిడ్కో కార్యనిర్వాహక ఇంజనీరు జి.ప్రసాదరావు, ఎల్‌డిఎం కృష్ణానాయక్‌, మెప్మా పీడీ పివి నారాయణ, మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు.