ప్రజాశక్తి-అద్దంకి: అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గృహ పథకం కింద మహాయజ్ఞంలా 90 శాతం మేర నిర్మితమైన టిడ్కో గృహ నిర్మాణాలను మిగిలిన 10 శాతం పూర్తి చేసి వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం శింగరకొండ లోని టిడ్కో గృహ సముదాయాలను స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక పేదల సొంతింటి కల పెనుభారంగా తయారైందని అన్నారు. అధికారంలోకి రావడం కోసం నోటికొచ్చిన అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఇళ్లు కట్టి ఇవ్వడానికి నానా తంటాలు పడుతున్నారని అన్నారు. జగన్‌రెడ్డి తన తుగ్లక్ నిర్ణయాలతో ఇళ్ళ స్థలాల కొనుగోలు అంటూ కొత్త స్కాంకు తెర తీశారన్నారు. పనికి రాని భూములను మూడు నాలుగు రెట్ల అధిక ధరలకు ప్రభుత్వంతో కొనిపించి వైసిపి నాయకులు మూటలు వెనకేసుకున్నారన్నారు. మొత్తంగా రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారన్నారు. రాష్ట్ర ప్రజలు అందరూ కళ్ల ముందు జరుగుతున్న ఈ విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.










