Mar 27,2023 20:33

టిడ్కో ఇళ్లను పరిశీలిస్తున్న భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి

టిడ్కో గృహాల్లో మౌలిక వసతులు శూన్యం
- మూడు నెలలుగా ఒక్కరూ చేరని వైనం
- అదే అభివృద్ధిగా చూపుతున్న సండే ఎమ్మెల్యే శిల్పా
- టిడిపి యువ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

       నంద్యాల ఎస్‌ఆర్‌బిసి కాలనీలో నిర్మించిన టిడ్కో గృహాలలో మౌలిక వసతులు లేకుండా ఆడంబరంగా ప్రారంభించి అదే అభివృద్ధి అని నంద్యాల సండే ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్‌ రెడ్డి చూపుతున్నారని టిడిపి యువ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి విమర్శించారు. సోమవారం నంద్యాలలోని ఎస్‌ఆర్‌బిసి కాలనీలోని టిడ్కో గృహాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలు అవుతున్నా ఒక్కరు కూడా నివాసం లేరని, ఎందుకు చేరలేకపోతున్నారని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై నంద్యాల సండే ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా టిడిపి అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో గృహాలను 95 శాతం పనులు పూర్తి చేశారని, మిగిలిన 5 శాతం పనులు నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నా పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి అన్నారు. భూమా నాగిరెడ్డి కల, ఆశయం నంద్యాల ప్రజలకు 13 వేల ఇల్లు కట్టించి సొంతింటి కల నెరవేర్చాలని, రోడ్‌ వైడింగ్‌ చేయాలని, తన తండ్రి ఆశయాన్ని మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తుందని, తమ చేతుల మీదుగానే పేదలకు గృహాలను పంపిణీ చేసి నెరువేరుస్తామన్నారు. అలాగే నంద్యాల ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేయాలని అమృత్‌ స్కీం కింద ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని నాడు 90 శాతం పనులు పూర్తి చేశామని, మిగిలిన 10 శాతం కూడా పూర్తి చేయలేకపోవడం దారుణమన్నారు. సమస్యలు పట్టించుకోకుండా, వారి స్థలాలకు విలువలు పెంచుకునేందుకు మెడికల్‌ కాలేజీ కట్టిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప నంద్యాల ప్రజలకు ఏమి చేయలేని చేతగాని ఈ సండే ఎమ్మెల్యే అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈసారి అధికారంలోకి వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని, భూమా నాగిరెడ్డి ఆశయాలను నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ శివశంకర్‌, గంగిశెట్టి విజరు కుమార్‌, బాల అకాడమీ రవి, కృపాకర్‌ తదితరులు పాల్గొన్నారు.