ప్రజాశక్తి -మధురవాడ : టిడ్కో, ఎన్‌టిఆర్, హుదూద్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్ డిమాండ్‌చేశారు. సుద్దగెడ్డ వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లను సిపిఎం మధురవాడ జోన్ కమిటీతో కలిసి ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడుతూ, ఆరేళ్ల క్రితం జివిఎంసి 7వ వార్డు పరిధి సుద్ధగెడ్డ ప్రాంతంలో 60 కుటుంబాల రజకులను ఖాళీ చేయించి టిడ్కో ఇళ్లు నిర్మించారని, సంవత్సర కాలంలో వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని నమ్మించి నేటికీ ఇవ్వక పోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఇంకా ఎంత కాలం వారు కార్యాలయాల చుట్టూ తిరగాలని ప్రశ్నించారు. వీరితో పాటు ఇల్లు లేని పేదలు లబ్ధిదారులుగా ఎంపికై ప్రభుత్వానికి డీడీ రూపంలో డిపాజిట్ చేశారని, వారికి కూడా ఇళ్లు పూర్తి చేసి ఇవ్వలేదని తెలిపారు. ఇతర ప్రాంతాలలో టిడ్కో, ఎన్‌టిఆర్ హుదూద్ ఇళ్ల నిర్మాణం చేపట్టి సుమారు తొమ్మిదేళ్లు కావస్తున్నా నేటికీ పూర్తి చేయలేదన్నారు. పేదలకు ఇళ్లు కట్టిస్తున్నామని ప్రచారం తప్ప లబ్ధిదారులకు అప్పగించే విధంగా పనులపై శ్రద్ద పెట్టడం లేదని విమర్శించారు. నిధులు మంజూరులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ నాయకులు డి.అప్పలరాజు, పి.రాజుకుమార్, బి.భారతి, డి.కొండమ్మ, టికె.శారద పాల్గొన్నారు.










