ప్రజాశక్తి గొలుగొండ: రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాట పట్టాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మండలంలోని కృష్ణదేవిపేట, కొంగసింగి గ్రామాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడుతూ, జగన్ బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు మద్యనిషేధం, ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తానని చెప్పిన జగన్ ఇప్పటికీ వాటిని అమల్లోకి తేలేక పోయారన్నారు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో నాటు సారా విపరీతంగా పెరిగి పోయిందని అన్నారు. ఆదాయాన్ని చూసుకోకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోనికి తీసుకెళ్లారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు టీడీపీ హయాంలోనే నిర్మాణం చేశామన్నారు. ప్రస్తుత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, వచ్చే ఏడాది జగన్ జైలుకేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, పార్టీ సీనియర్ నాయకులు చిటికెల సాంబమూర్తి, సర్పంచ్లు అదపురెడ్డి గోపాలకృష్ణ, మాజీ సర్పంచ్లు సుర్ల బాబ్జీ, మాజీ ఎంపిటిసి చింతల నారాయణమూర్తి నాయుడు, స్థానిక నాయకులు రమణ, బుజ్జి, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.










