Nov 01,2023 20:31

సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నేత చౌదరి నారాయణమూర్తి

శృంగవరపుకోట: టిడిపితోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ శృంగవరపుకోట నియోజకవర్గ పరిశీలకులు చౌదరి నారాయణమూర్తి అన్నారు. చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో సత్యమేవ జయతి కార్యక్రమాన్ని నిర్వహింంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు లాంటి విజనున్న వ్యక్తినే జగన్‌ అరెస్టు చేయించి, పైశాచిక ఆనందాన్ని పొందారని విమర్శించారు. ప్రజలు వైసిపిని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎవరూ పార్టీకి అతీతం కాదన్నారు. నియోజకవర్గంలో తనకు తెలియకుండా పార్టీ కార్యక్రమాలు చేపట్టకూడదని, ఎవరు పిలిచినా వచ్చి పార్టీకి పనిచేస్తానని తెలిపారు. త్వరలోనే కోళ్ల లలితకుమారి, గొంప కృష్ణపై కార్యకర్తలు, ప్రజలు, బూత్‌ కన్వీనర్ల అభిప్రాయాలు తీసుకుని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ మాట్లాడుతూ. ఏ తప్పూ చేయని చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారన్నారు. చంద్రబాబు అరెస్టును ప్రపంచంలో 119 దేశాల్లో ప్రజలు రోడ్లమీదకి వచ్చి వ్యతిరేకించారని గుర్తుచేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేనలదే గెలుపని ధీమా వ్యక్తంచేశారు.
వేపాడ : సత్యమేవ జయతే కార్యక్రమానికి టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు, తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మడి భారతి ఆధ్వర్యంలో మండలం నుంచి టిడిపి, జనసేన నాయకులు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు.