Jul 19,2023 00:08
మహిళను ఆప్యాయంగా పలకరించి కరపత్రాలు అందజేస్తున్న టిడిపి బాపట్ల బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ

ప్రజాశక్తి-కర్లపాలెం: బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యమని, తెలుగుదేశం పార్టీతోనే ప్రజలందరి భవిష్యత్‌కు గ్యారంటీ అని టిడిపి బాపట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ అన్నారు. మంగళవారం కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం మీ మాట-నా బాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ విధానాలను వివరిస్తూ మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ వారికి చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురుంచి తెలియజేసే కరపత్రాన్ని, తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన మినీ మెనిఫెస్టో, భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని నా తోబుట్టువుగా భావించి ఇలా పసుపు కుంకుమ ఇచ్చి మీ ఆశీస్సుల కోసం వచ్చానని, తనను ఆశీర్వదించి ఆదరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో అమలు చేయబోయే సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజల భవితకు భరోసా ఏర్పడుతుందన్నారు. మహిళలకు మహిళా శక్తి, ఆడబిడ్డ నిధి, దీపం పథకాలు, నిరుద్యోగ యువతకు యువగళం నిధి, అన్నదాతలకు సాయం, పారిశ్రామిక అభివృద్ధితో ఉద్యోగ కల్పన, బీసీలకు రక్షణ చట్టం, పేదవారిని ధనవంతులుగా చేసేలా పూర్‌ టూ రిచ్‌ ప్రణాళికలు ఇలా ప్రతి ఒక్కరికీ అండగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు డబ్బులు సమయానికి వచ్చేవని అన్నారు. సీజన్‌ రాగానే పంట కాలువలు పూడికతీత తీయించి సక్రమంగా నీరు అందజేసేవారు. కానీ నేడు ఈ వైసీపీ ప్రభుత్వంలో అవేమీ లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దమ్మన్నవారి పాలెం గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల నాయకులు, దమ్మన్నవారిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.