Sep 02,2023 00:13

ప్రజాశక్తి - మార్టూరు రూరల్
టిడిపితోనే ఎస్టీల ప్రయోజనాలు నెరవేరుతాయని బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్టీ సెల్ ప్రతినిధులు ఎమ్మెల్యే ఏలూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. గిరిజన తెగల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన డిమాండ్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి మేనిఫోస్టోలో చేర్చేవిధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన కార్పొరేషన్‌ ద్వారా అనేక మందికి లక్షల రూపాయల రుణాలు టిడిపి ప్రభుత్వంలో ఇచ్చినట్లు తెలిపారు. ఎస్టి కాలనీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. రోడ్లు, విద్యుత్, సైడ్ డ్రైన్‌లు, ఇల్లు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఉపప్రణాళిక నిధులతో ఎస్‌టి కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చాక గిరిజనులకు సంబంధించిన సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించడం వల్ల గిరిజన గ్రామాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎస్టీ సెల్ ప్రతినిధులు మాట్లాడుతూ యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.10లక్షల రుణాలు అందజేయాలని కోరారు. గిరిజన జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్సీ స్థానాన్ని యానాదులకు ఇవ్వాలని కోరారు. మైదాన ప్రాంతాలలో రిజర్వాయర్లు, డ్యాములు, చెరువులలో చేపలు పట్టుకొని జీవించే మత్స్యకార సొసైటీ సభ్యులకు మత్స్యకార భరోసా అవకాశం కల్పించాలన్నారు. జీవో నెంబర్ 217రద్దు చేయాలని కోరారు. గృహ నిర్మాణ పథకంలో యానాదులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని పెంచాలన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. చంద్రన్న బీమా రూ.10లక్షలు వరకు పెంచి పునరుద్ధరించాలని కోరారు. నూతన ఐటీడీఏను బాపట్ల కేంద్రంగా యానాది ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని కోరారు. యానాదులు అందరికీ అంత్యోదయ కార్డులు, స్మశాన స్థలాలు, యానాదుల కాలనీలో కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు తిరుమలశెట్టి శ్రీను, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎస్టీ సెల్ కార్యదర్శి అద్దురి వెంకటేశ్వర్లు, విభిన్న ప్రతిభావంతుల మీడియా కోఆర్డినేటర్ ఇండ్ల శ్రీనివాసరావు, కారంచేడు  ఎస్టీ సెల్ అధ్యక్షుడు పొన్నరుసు వెంకటేశ్వర్లు, చిన్నగంజం ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాచూరి కుమార్ పాల్గొన్నారు.