Jun 20,2023 19:29

సమావేశంలో మాట్లాడుతున్న విజయ భాస్కర్‌ గౌడ్‌

ప్రజాశక్తి - దేవనకొండ
టిడిపిలో అనేక పదవులు చేపట్టి లబ్ధి పొందిన కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు కుమార్తె, ఆస్పరి మాజీ జడ్‌పిటిసి బొజ్జమ్మ టిడిపిని విమర్శించడం తగదని టిడిపి నాయకులు తెలిపారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌ గౌడ్‌, మండల నాయకులు ఉచ్చీరప్ప, బడిగింజల రంగన్న, రామారావు నాయుడు, రాజశేఖర్‌ గౌడ్‌, ఆకుల వీరేష్‌ మాట్లాడారు. టిడిపి ప్రభుత్వంలో బొజ్జమ్మ కుటుంబం నాలుగు సార్లు ఎంపిపి, రెండుసార్లు జడ్‌పిటిసి, రెండు సార్లు కో ఆపరేటివ్‌ ఛైర్మన్‌ పదవులు చేపట్టారని తెలిపారు. పదవులు చేపట్టి టిడిపిపై బురదజల్లడం సమంజసం కాదన్నారు. వ్యక్తిగత విషయాలతో ఫ్యాక్షన్‌ గొడవలు పెట్టుకొని కోట్ల కుటుంబాన్ని విమర్శించడం తగదని హెచ్చరించారు. స్వలాభం కోసం వైసిపిలోకి వెళ్లి టిడిపిని విమర్శిస్తే సహించేది లేదన్నారు. సొంత పలుకుబడితో అన్ని పదవులూ గెలిచి ఉంటే సొంత గ్రామంలో సర్పంచిగా ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. టిడిపి మండల నాయకులు మల్లికార్జున గౌడ్‌, వెంకటస్వామి గౌడ్‌, రాజాసాబ్‌, రాజగోపాల్‌ గౌడ్‌, చాంద్‌ బాషా పాల్గొన్నారు.