ప్రజాశక్తి -కశింకోట
తెలుగు దేశం పార్టీలో యువతకు ప్రాధాన్యత ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. మండలంలోని తాళ్ళ పాలెంలో టిడిపి మండల అధ్యక్షుడు కాయల మురళి అధ్యక్షతన జరిగిన మండల తెలుగు యువత విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల తెలుగు యువత కమిటీ ఏర్పాటు చేశారు. తెలుగు యువత అధ్యక్షుడుగా సిద్దిరెడ్డి సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పక్కూర్తి సంతోష్ ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవులు కేవలం అలంకారం ప్రాయంగా ఉండకూడదని, ప్రతిఒక్కరూ నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసేవరకు కృషి చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో గ్రామ తెలుగు యువత కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాలలో జరుగుతున్న అవినీతిపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి, టిడిపి నాయకులు వేగి గోపీకృష్ణ, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, మజ్జి నిరంజన్ కుమార్, ఎంపీటీసీ బుద్దిరెడ్డి అప్పడు, షేక్ బాబర్, బుద్ది రెడ్డి గంగయ్య, సీరంశెట్టి వెంకట లక్ష్మీ, సత్యనారాయణ, కర్రి దుర్గి నాయుడు తదితరులు పాల్గొన్నారు.










