ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి :టిడిపిలో నిశ్శబ్ధ యుద్ధం కొనసాగుతోంది. యువగళంతో ఉత్సహంగా కనిపించిన ఆపార్టీ నేతలు ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్నారు. అన్ని నియోజవర్గాల్లో నేతలు, కార్యకర్తలు నిరుత్సహంగా కనిపిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, కావలి, సూళ్లూరుపేట, వెంకటగిరి, కోవూరు నియోజకవర్గాల్లో టిక్కెట్లు కోసం కసరత్తు సాగుతోంది. ఇటీవల వైసిపి నుంచి వచ్చిన నేతలు అధికారికంగా పార్టీలో చేరలేదు. ఆపార్టీ జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ రెండన్నర నెలలుగా పార్టీ కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు. అనార్యోగ సమస్య ఉన్నప్పటికీ ఇదే కారణం కాదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా స్థాయిలో నాయకులు కలిసి పనిచేస్తున్నారనే భావన కలగడం లేదు. ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అమెరికా వెళ్లారు. ఈనెల 6న జిల్లాకు రానున్నారు.
తెలుగుదేశం పార్టీలో నేతలు, కార్యకర్తల్లో నిరుత్సహం కనిపిస్తోంది. ఇటీవల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రతో నేతలంతా కలిసి పనిచేశారు. సుమారు నెలరోజుల పాటు సాగిన పాదయాత్రలో ఆపార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. వైసిపి నుంచి వచ్చిన వెంకటగిరి,నెల్లూరు రూరల్, ఉదయగిరి ఎంఎల్‌ఎలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు టిడిపికి దగ్గరయ్యారు. పార్టీలో అధికారికంగా చేరలేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయగిరి, కావలి, సూళ్లూరుపేట, వెంకటగిరి, కోవూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయం కొలిక్కిరాలేదని తెలుస్తోంది. ఉదయగిరిలో టిడిపి టికెట్ కోసం పోటీ నెలకుంది. మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని రామారావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కాకర్ల సురేష్ తమదంటే తమదేనంటున్నారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో ఆయన సోదరులు మాట్లాడారనే ప్రచారం సాగుతోంది. రాజారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని, మౌనంగా ఉండాలని రాజీ చేశారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో కావలి ప్రాంతానికి చెందిన కావ్య కృష్ణారెడ్డి తాను ఉన్నానంటూ కార్యకర్తలకు చెబుతున్నారు. ఇక్కడ ఎవరికి వారే అన్నట్లు నడుస్తున్నారు. కావలి నియోజకవర్గంలో ఎం. సుబ్బానాయుడు, కావ్యకృష్ణారెెడ్డి, పసుపులేటి సుధాకర్ రంగంలో ఉన్నారు. ఎవరికి వారు తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. యువగళంలో భారీ ఏర్పాట్లు చేసిన నేతలు ఇప్పుడు స్తబ్దతగా ఉన్నారు. ఆత్మకూరు యువగళంలో ఉత్సహంగా పాల్గొన్న ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. అక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆయన రావడంతో ఎప్పటి నుండో పార్టీలో ఉన్న నేతలు గుంభణంగా ఉన్నారని తెలుస్తోంది. సూళ్లూరుపేట అభ్యర్థి విషయంలోనూ పలుపేర్లు ముందుకు వస్తున్నాయి. దీనిపైనా ఆపార్టీ ఎలాంటి సృష్టత ఇవ్వలేదు. తమకెందుకులే అన్నట్లు అక్కడ నేతలు, కార్యకర్తలున్నారు. వెంకటగిరిలో మాజీ ఎంఎల్‌ఎ కె. రామకృష్ణ తనదే టిక్కెట్ అంటుండగా, ప్రముఖ వ్యాపారవేత్త , మైనార్టీ నేత తాను రంగంలో ఉన్నానని ప్రచారం చేసుకుంటున్నారు. ఐదు నియోజకవర్గాల్లో టిడిపిలో సృష్టత కనిపించడం లేదు. అందుకే నేతలు, కార్యకర్తలు నిరుత్సహంగా కనిపిస్తున్నారు. నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, సర్వేపల్లి, గూడూరు, నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అమెరికా వెళ్లారు. ఈనెల 6న జిల్లాకు రానున్నారు. వచ్చిన తర్వాత అందరినేతలను కలుపుకుపోతారని ఆపార్టీ నేతలంటున్నారు.
అజీజ్ పార్టీ ఆఫీసుకు దూరం...!
టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ టిడిపి పార్టీకి రెండున్నర నెలల నుంచి దూరంగా ఉన్నారు. యువగళంకు మందునుండే ఆయనకు అనారోగ్యం సరిగా లేదు. చెన్నెరులో చికిత్స చేయించుకున్నారు. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీలోకి రావడం.. ఆయనకు టికెట్ ఆశ పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయనతో పాటు ఉన్న నేతలంతా ఇప్పుడు శ్రీధర్‌రెడ్డితో తిరుగుతున్నారు. ఆరోగ్యం కుదుటపడినా జిల్లా పార్టీ కార్యాలయానికి రావడం లేదు. ఈ పరిణామాలను వైసిపి తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అజీజ్‌తో మాట్లాడుతున్నామని, తమ పార్టీలో చేరతారని ప్రచారం చేస్తున్నారు. జిల్లా నేతలతోనూ అంటీ అంటనట్లు ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల జిల్లాకు వచ్చిన చంద్రబాబునాయుడు అజీజ్ ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి పి. నారాయణ అజీజ్‌ను జాగ్రత్తగా పట్టుకొస్తున్నారని తెలుస్తోంది. ఆదివారం నెల్లూరు నగరంలో జరిగిన సమావేశానికి నారాయణతో కలిసి అజీజ్ పాల్గోన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే వరకు ఆపార్టీలో నిరుత్సహం కొనసాగుతుందని తెలుస్తోంది.










