గుమ్మలక్ష్మీపురం: కురుపాం నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన బస్సుయాత్ర విజయవంతం కావడంతో టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం, ఉత్సాహం నింపింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బస్సు యాత్రలో రెండు గ్రూపుల వారు కలిసికట్టుగా పాల్గొన్నారు. దీంతో టిడిపిలో పూర్వ వైభవం కనిపించింది. బస్సు యాత్రలో దారి పొడవునా టిడిపి జెండాలో రెపరెపలాడాయి. టిడిపిలో గ్రూపు రాజకీయాలు ఎక్కడా లేవని, ఆశావాహుల టిక్కెట్ కోసమే కేవలం ప్రయత్నాలు జరిగాయని టిడిపి సీనియర్ నాయకులు దత్తి లక్ష్మణరావు వివరించారు. ఇకనుంచి పార్టీ కార్యక్రమాలు క్రమశిక్షణతో జరుగుతాయన్నారు. మనలో ఐక్యత లేకపోవడమే స్థానిక ఎమ్మెల్యే రెండుసార్లు గెలిచిందన్నారు. రానున్న ఎన్నికలకు దశ, దిశ నిర్దేశించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చిన మేరంగి రాజులను ఓడించడమే లక్ష్యంగా 2024 ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై టిడిపి ఇన్చార్జి జగదీశ్వరి, దత్తి లక్ష్మణరావు కనిపించారు. ఇరు గ్రూపుల కలయికతో పసుపు దండు విజయం తప్పదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.










