Aug 26,2023 20:50

టిడిపిలోకి సుబ్బారెడ్డిని ఆహ్వానిస్తున్న చంద్రబాబునాయుడు

రాజంపేట అర్బన్‌ : రాజంపేట మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌, వైసిపి నాయకులు పోలి సుబ్బారెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. శనివారం విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. చిన్నిల్లుగారిపల్లెకు చెందిన సుబ్బారెడ్డి రాజంపేట వైసిపిలో ముఖ్యమైన నేతగా ఉంటూ పోలి తదితర గ్రామాల రాజకీయాలపై ప్రభావం చూపే వ్యక్తిగా ఉన్నారు. అలాంటి కీలకమైన నాయకుడు వైసిపిలో అసంతప్తి కారణంగా ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును కలవడంతో నియోజకవర్గంలో పెద్ద కలవరం రేగింది. వైసిపి పెద్దలు సుబ్బారెడ్డికి బుజ్జగింపులు కార్యక్రమాలు చేపట్టారు. మంతనాలు, బుజ్జగింపులు సరిపడని నేపథ్యంలో రెండు రోజులు కిందట వైసిపి అధిష్టానం క్రమశిక్షణ చర్యల కారణంగా రాజంపేట మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న పోలి సుబ్బారెడ్డి తల్లి రామసుబ్బమ్మతో పాటు సుబ్బారెడ్డిని కూడా సస్పెండ్‌ చేయడం జిల్లాలోనే పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి శుక్రవారం టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడుతో సమావేశమై మంతనాలు జరిపి విజయవాడలో చంద్రబాబు నాయుడు సమక్షంలో శనివారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయం నియోజకవర్గంలోనే కాక జిల్లా వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు ప్రస్తుత జనసేన నాయకులు పత్తిపాటి కుసుమకుమారి తిరిగి టిడిపిలో చేరి కండువా కప్పుకున్నారు. సుబ్బారెడ్డి టిడిపి కండువా కప్పుకున్న కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు, రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కస్తూరి విశ్వనాధనాయుడు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు బి.హరిప్రసాద్‌, డాక్టర్‌ సుధాకర్‌, రాజంపేట నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు.