Nov 21,2023 21:24

టిడిపిలో ఆధిపత్యపోరు

టిడిపిలో ఆధిపత్యపోరు టిడిపిలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కడప టిడిపి టికెట్‌ ఆశావహులైన టిడిపి ఇన్‌ఛార్జి ఆర్‌.మాధవిరెడ్డి, మాజీ ఇన్‌ఛార్జి అమీర్‌బాబు, సీనియర్‌ నాయకులు లకీëరెడ్డి మధ్య తారా స్థాయిలో విబేధాలు కొనసాగుతుండడం కేడర్‌ను కలవరపరుస్తోంది. బాబుతో నేను, భవిష్యత్‌ గ్యారెంటీ, యువనేత నారా లోకేష్‌ పర్యటన, పార్టీలో చేర్పులతో కూడిన కార్యక్రమాల నిర్వహణలో ఎవరికి వారుగా వ్యవహరిస్తుండడం విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపించడం తెలిసిందే. ముగ్గురు నేతల మధ్య నెలకొన్న విభేదాలు కేడర్‌ను గందరగోళానికి గురిచేశాయని చెప్పవచ్చు. టిడిపి అధిష్టానం శాస్త్రీయమైన సర్వేల ఆధారంగా టికెట్‌ కేటాయిస్తే గట్టిపోటీనిచ్చే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.ప్రజాశక్తి - కడప ప్రతినిధి
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో అధిష్టానం చోద్యం చూస్తుండడం కేడర్‌ను గందరగోళం నెలకొంది. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నియా మకం, టికెట్‌ కేటాయింపుల వ్యవహారంలో ఆర్‌.మాధవిరెడ్డి వర్సెస్‌ లకీëరెడ్డి, అమీర్‌బాబు మధ్య ట్రయాంగిల్‌ ఫైట్‌ నడుస్తోంది. మాజీ ఇన్‌ఛార్జి అమీర్‌బాబును ఇటీవల చంద్ర బాబు పిలిపించుకుని మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. నాన్‌లోకల్‌ వ్యక్తులకు టికెట్‌ ఇస్తే గెలిచే అవకాశాలు లేవని సూటిగానే చెప్పినట్లు సమాచారం. మైనార్టీ నియోజకవర్గంలో ముస్లిమేతరులకు టికెట్‌ ఇస్తే ప్రత్యర్థులకు వరంగా మారతుందని వివరించినట్లు తెలిసింది. ఇదేతరహాలో సీనియర్‌ నాయకులు లకీëరెడ్డి బృందం చంద్రబాబును కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
పొరుగుపైనా ప్రభావం
కడపలో నాన్‌లోకల్‌ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీ బలహీన పడు తుందని, దీని ప్రభావం పొరుగు నియోజకవర్గమైన కమలాపురంపై పడే అవకాశం ఉంది. అధికార పార్టీ అభ్యర్థులు కడప కేంద్రంగా రాజకీయాలు నెరుపుతుండగా, ప్రతి పక్ష టిడిపి ఎన్నికలు పూర్తవగానే ఇతర ప్రాంతాలకు వెళ్లే నాయకులకు టికెట్లు ఇస్తే పార్టీ కేడర్‌ గందరగోళానికి గురవుతుందనే వాదన వినిపిస్తోంది. పూర్తి స్థాయిలో రాజకీయాలు చేసే వ్యక్తులకు టికెట్లు ఇవ్వకుండా పార్ట్‌టైమ్‌ రాజకీయాలకు, కాంట్రాక్టర్లు, పారిశ్రా మిక వేత్తలకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీకి తీవ్రనష్టం వాటిల్లుతోందనే వాదన వినిపిస్తోంది.
అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర
ఇటీవల టిడిపి అధిష్టానం తరుపున జిల్లాకు వచ్చిన ఓ నాయకునికి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకులు బృందంగా కలిసి గట్టిగానే చెప్పినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఇంటింటికీ వెళ్తూ చాపకింద నీరులా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తగ్గించుకునే ప్రయత్నంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష టిడిపి టికెట్ల కోలాటంలో కేడర్‌ను గందరగోళంలోకి నెడుతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది.
సర్వేలపై సందేహాలు
టిడిపి అధినాయకత్వం శాస్త్రీయంగా సర్వేలు చేయడం ఎందుకని, నచ్చిన వారికి టికెట్లు ఇస్తే సరిపోతుంది కదా అనే వ్యంగ్యమైన మాటలు వినిపిస్తోంది. నాలుగు నుంచి ఐదు శాస్త్రీయ సర్వే బృందాలు ఏమి సూచించినట్లనే వాదన వినిపిస్తోంది. సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని చెప్పిన హామీ అమలు చేయాలని, అప్పుడు గట్టి పోటీని ఇవ్వవచ్చనే వాదన కేడర్‌ నుంచి వినిపిస్తోంది. సర్వేల ప్రకారం నడుచుకోని పక్షంలో చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుందనే నర్మగర్భమైన సూచనలు వంటి హెచ్చరికలు వాదన అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. టిడిపి అధినాయకత్వం జిల్లాపై స్పష్టమైన, శాస్త్రీయమైన వైఖరితో ముందుకెళ్తేనే ప్రయోజనం ఉంటుందని చెప్పవచ్చు.