ప్రజాశక్తి - నందవరం
టిడిపి అధికారంలో ఉండగా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా మాధవ రావు దేశాయికి పదవి ఇచ్చారు. అది స్టే రావడంతో మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. 2019లో టిడిపి అధికారం కోల్పోయినా మాధవరావు దేశాయి మాత్రం మాజీ ఎమ్మెల్యే బీవీ.జయ నాగేశ్వర రెడ్డి వెంటే నడిచారు. దాదాపు నాలుగేళ్లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని, బీవీని వదలకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. కొంతమంది నాయకులు ఆయనపై కక్షతో గత నాలుగేళ్ల నుంచి పార్టీకి దూరంగా ఉన్నా గ్రూపును పార్టీలో చేరదీయడంతో బీవీ.జయ నాగేశ్వర రెడ్డికి దూరంగా ఉంటున్నారు. అలాగే నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా ఆయన ఏర్పాటు చేసిన బ్యానర్‌లో ఎక్కడా బీవీ ఫొటో లేకుండా, సొంతంగా పాదయాత్రలో పాల్గొని తన బలాన్ని నిరూపించుకున్నారు. తన రాజకీయ శత్రువైన గ్రూపును చేరదీయడం ఎంతవరకు న్యాయమని, బీవీ మరో గ్రూపు పార్టీలోకి తిరిగి వస్తున్నారని తెలిసినా తనను అవమానించడానికే సమాచారం ఇవ్వలేదని, కొంతమంది టిడిపి నాయకులతో ఆయన అన్నట్లు సమాచారం. మాధవ రావు బీవీకి దూరం కావడంతో కోట్ల గ్రూపునకు చెందిన కొంతమంది నాయకులు ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి కూడా తన కుమారుని రాజకీయ అరంగ్రేటం చేసేందుకు సిద్ధమయ్యారని, అందుకోసం అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి, ఎమ్మెల్యే టికెట్ సాధించేందుకు నియోజకవర్గంలో తన గ్రూపును పటిష్టంగా ఏర్పాటు చేసుకునేందుకు బీవీపై అసంతృప్తి ఉన్న నాయకులను తన గ్రూపులోకి రప్పించుకునేందుకు మాధవరావు దేశాయిని సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని అసంతృప్తి నాయకులు కోట్ల గ్రూపులో చేరారు. ఎమ్మిగనూరు, గోనెగండ్లలో పటిష్టమైన కోట్ల గ్రూపు చురుకుగా పని చేస్తోందని, ఒక్క నందవరం మండలంలో లేకపోవడంతో మాధవ రావును తన గ్రూపులోకి తెచ్చుకుంటే, మండలంలోని కొంతమంది అసంతృప్తి నాయకులను కూడా కోట్ల గ్రూపులోకి తీసుకొస్తారనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించినట్లు సమాచారం. నెలలోపు తన కార్యాచరణ ప్రకటిస్తానని తన అనుచరులతో అన్నట్లు సమాచారం. నియోజకవర్గలోని అసంతృప్తి నాయకులంతా ఏకమైతే బీవీకి ఎమ్మెల్యే టికెట్ వచ్చే మార్గం కష్టమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
టిడిపి మండల కార్యాలయం










