Nov 19,2022 23:35

మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం ముత్యాలనాయుడు

ప్రజాశక్తి- దేవరాపల్లి
రానున్న ఎన్నికలు టిడిపికి ఆఖరి ఎన్నికలని, ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెబుతున్నారని, క్యాడర్‌ అంతా ఇదే భావనలో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. దద్దమ్మలు, సన్నాసులు ఆ పార్టీలో ఉన్నారని, అందుకే ఆ పార్టీ అంతానికి వచ్చేసిందని పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని అనగానే పెయిడ్‌ ఆర్టిస్టుల చేత చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారని, అందుకే జనాలు ఎక్కడికి వెళ్ళినా గుడ్‌ బై బాబు, గో బ్యాక్‌ బాబు అంటూ నినాదాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మతిస్థిమితం లేని వ్యక్తి మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారని, దీనికి లోకేష్‌ లాంటి పప్పు పుట్టడమే దీనికి కారణమని తెలిపారు. కుటుంబ సభ్యులు త్వరగా చంద్రబాబును మానసిక ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. రేపటి తరానికి మార్గదర్శనం చూపిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పిటిసి కర్రి సత్యం, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, కొప్పల వెలమ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ వరదపరెడ్డి సింహాచలం నాయుడు, వైసిపి మండల అధ్యక్షుడు బూరె బాబురావు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.