Oct 28,2023 01:07

సమావేశంలో మాట్లాడుతున్న ఆనందబాబు

ప్రజాశక్తి-తెనాలి : రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసిపి ప్రభుత్వ అసమర్ధ పాలనను ఎత్తిచూపుతున్నందుకే అవినీతి మరకను అంటించి చంద్రబాబునాయుడిని అరెస్ట్‌ చేయించారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. స్థానిక నాజరుపేట ఎన్వీఆర్‌ కన్వెన్షన్‌లో టిడిపి తెనాలి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆనందబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసిపి ఓడిపోతే జగన్‌ మళ్లీ జైలుకు వెళ్ళడం తథ్యమని భావించి, కుట్రపూరితంగా చంద్రబాబును అరెస్ట్‌ చేశారన్నారు. ఇలాంటి అరెస్టులు, సంక్షోభాలు టిడిపికి కొత్తేమీకాదన్నారు. వచ్చేనెల ఒకటి నుంచి జగన్‌ ప్రభుత్వం పోరాటం చేస్తామన్నారు. టిడిపి, జనసేన సమిష్టిగా ముందుకు సాగుతాయన్నారు. సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ టిడిపి హయాంలో ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాలకు అమలు చేసినసంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం ఎందుకు తొలగించిందో చెప్పగలరా? అని ప్రశ్నించారు. సామాజిక సాధికార బస్సుయాత్ర అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వైసిపి పాలనను పారదోలేందుకు ప్రజలు సిద్ధం కావాలని అన్నారు. భువనేశ్వరి చేపట్టే నిజం గెలవాలి యాత్ర, లోకేష్‌ చేపట్టే బాబు భరోసా, భవిష్యత్‌కు గ్యారంటీ, యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలనే తీర్మానాలను ఈ సందర్భంగా ఆమోదించారు. నాయకులు టి.హరిప్రసాద్‌, వి.సాంబిరెడ్డి, కె.ఏడుకొండలు, జె.మహేష్‌, సిహెచ్‌.పుల్లారావు, ఎ.వెంకటేశ్వరరావు, డాక్టర్‌ వి.శేషగిరిరావు, మహ్మద్‌ ఖుద్దూస్‌, డి.అనిత, కె.కోటేశ్వరరావు పాల్గొన్నారు.