Apr 04,2023 23:36

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గంటా శ్రీనివాసరావు

ప్రజాశక్తి- పిఎం.పాలెం : 1983లో ఎన్‌టి.రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎలాంటి స్పందన లభించిందో నేడు తెలుగుదేశం పార్టీకి అదే స్పందన ప్రజల్లో కనిపిస్తోందని ఉత్తర నియోజక వర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. పిఎం.పాలెంలోని వి కన్వెన్షన్‌ సెంటర్‌లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు బుధవారం నిర్వహించనున్న ఉత్తరాంధ్రలోని 35 నియోజకవర్గల జోన్‌ 1 ప్రతినిధుల సభ ఏర్పాట్లను మంగళవారం ఉత్తరాంధ్ర టిడిపి ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాస్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, టిడిపి కార్యకర్తలు, నాయకులు నూతనోత్తేజంతో చంద్రబాబుకు ఘన స్వాగతం పలకనున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైఖరిలో మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. వైసిపి నిర్వహించిన వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు ఇందుకు నిదర్శనం అన్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను మారుస్తానంటూ చాలా సార్లు ప్రకటించిన ముఖ్యమంత్రి నేడు ఏ ఒక్క ఎమ్మెల్యేనూ వదులోకోబోనని చెబుతున్నారని ఎద్దేవాచేశారు. ఉత్తరాంధ్ర టిడిపి ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో ఈ సారి 35 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని తెలిపారు. బుధవారం నిర్వహించే సభ నుండే విజయ శంఖారావం పూరిస్తున్నామని చెప్పారు. టిడిపి విజయం ఉత్తరాంధ్ర నుంచే మొదలవుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చెయ్యటానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, నాయకులు పల్లా శ్రీనివాస్‌యాదవ్‌, పీలా శ్రీనివాసరావు, మొల్లి లక్ష్మణరావు, వండ్రసి అప్పలరాజు, దాసరి శ్రీనివాస్‌, గరే గురునాథ్‌, రెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.