Sep 04,2023 23:06

మాట్లాడుతున్న మంత్రి ధర్మాన

* రెవెన్యూ మంత్రి ప్రసాదరావు
ప్రజాశక్తి- కోటబొమ్మాళి: 
ప్రతిపక్ష నాయకుల మాటలు విని జన్మభూమి కమిటీల పాలన కావాలంటే టిడిపికే ఓటు వేయాలని రెవన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మండలంలోని వాండ్రాడలో రూ. 40 లక్షలలో నిర్మించిన సచివాలయ భవనాన్ని, చిన్నబమ్మిడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.61.42 లక్షల నాడు-నేడు నిధులతో నిర్మించిన ఆదనపు భవనాలను, నిమ్మాడ కూడలిలో రూ.1.85 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. అనంతరం నిమ్మాడ పిహెచ్‌సి ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన అవసరం లేకుండా అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ప్రతి పక్షనాయులు వారి సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం మీకు చెడుమాటలు చెబుతున్నారని అన్నారు. అవి విని మీరు టిడిపికి ఓటేస్తే మీకు సంక్షేమ పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరిగాల్సి వస్తోందన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఈ పని మేము చేశాము అని చెప్పుకొనే పని ఏదీ చేయలేకపోయారని విమర్శించారు. నాడు రాజశేఖరరెడ్డి, నేడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంతో చెప్పుకోవడానికి చాలా ఉన్నాయన్నారు. సిఎం జగన్‌ భవిషత్‌ తరాల కోసం నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు చేసింది శూన్యమని అన్నారు. కళింగ కార్పోరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ మాట్లాడుతూ నిమ్మాడ ప్రజలు తమకు ఓటు వేయకపోయినా ఏ ఒక్కరికైనా సంక్షేమ పథకంలోనూ ఇబ్బందులు పెట్టలేదని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి, ఎమ్మెల్సీ నత్తు రామారావు, మండల పరిషత్‌ అధ్యక్షుడు రోణంకి ఉమామల్లేశ్వరరావు, ఎంపిడిఒ కె.ఫణీంద్రకుమార్‌, తహశీల్దార్‌ జామి ఈశ్వరమ్మ, వైసిపి నాయకులు అన్నెపు రామారావు పాల్గొన్నారు.