Oct 07,2023 21:43

విలేకరులతో మాట్లాడుతున్న విప్‌ కాపు రామచంద్రారెడ్డి

          ప్రజాశక్తి-రాయదుర్గం    తెలుగుదేశం పార్టీకి కాలం చెల్లిందని, ఆపార్టీలోని కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తమ పార్టీలోకి రావాలని విప్‌ కాపు రామచంద్రారెడ్డి సూచించారు. శనివారం రాయదుర్గంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అడ్డంగా దొరిగి జైలులో ఉన్నారన్నారు. కేసు నమోదు అయ్యాక విచారణ తర్వాత ఆధారాలతో సిఐడి అధికారులు కోర్టు ముందు ప్రవేశపెట్టారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్‌ కోసం వెంపర్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు, లోకేష్‌ తమపై ఎన్ని కేసులు ఉన్నా భయం లేదని చెప్పి.. నేడు ఒక్కో కేసు బెయిల్‌ కోసం కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు. మీ మాటలు విని సామాన్యులు అరెస్టు అయ్యి వారి జీవితాలు నాశనం చేసుకోవాలా.. అని ప్రశ్నించారు. ఇకపోతే చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చేంత వరకూ తాను అన్నం ముట్టనని చెప్పి ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న కాలవ శ్రీనివాసులు మరుసటి రోజే తనకు ఆరోగ్యం బాగాలేదని పోలీసులను కాళ్లావేళ్లా పడి శిబిరం నుంచి బయటపడ్డాడని ఆరోపించారు. ప్రజలు ఎవరు మంచి చేస్తే వారిని సమర్థించాలని, దోపిడీదారులను కాదని హితవు పలికారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు ఉపేంద్రరెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాసులు, శివప్ప, గోవిందు, వలిబాషా, తదితరులు పాల్గొన్నారు.