Oct 13,2023 23:02

టిడిపి × వైసిపి గాలి భానుప్రకాష్‌ కారుపై దాడి నగరిలో ఉద్రిక్తత, ర్యాలీ పోలీసు స్టేషన్‌ ఎదుట ధర్నా

టిడిపి × వైసిపి
గాలి భానుప్రకాష్‌ కారుపై దాడి
నగరిలో ఉద్రిక్తత, ర్యాలీ
పోలీసు స్టేషన్‌ ఎదుట ధర్నా

ప్రజాశక్తి - నగరి
మంత్రి ఆర్‌కె రోజా అభివృద్ధి చేయడం చేతగాక తన కారుపై దాడికి పాల్పడిందని గాలి భానుప్రకాష్‌ మండిపడ్డారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ దాడి జరిగిందని, రోజా ఇంటినుంచి తన ఇల్లు ఎంత దూరమో, తన ఇంటినుంచి ఆర్‌కెరోజా ఇంటికి అంతే దూరమన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. చేతనైతే నియోజకవర్గాన్ని మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపాలని సవాల్‌ విసిరారు. గాలి భానుప్రకాష్‌ కారుపై టిడిపి శ్రేణుల దాడి ఘటనతో నగరిలో రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
నగరి ఏరియా ఆస్పత్రి వద్ద వైసిపి మూకలు టిడిపి నియోజకవర్గ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ కారుపై దాడి చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసిపి కార్యకర్తలు కారు అద్దాలను, కారును ధ్వంసం చేశారు. 'బాబుతో నేను' కార్యక్రమం, కార్యకర్తల పరామర్శ అనంతరం జనసేన- కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో జరగనున్న రైతులకు అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్న సమయంలో వైసిపి మూకలు దాడి చేశారు. డ్రైవర్‌ చాకచక్యంతో ప్రాణాపాయం తప్పింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం స్పీడు బ్రేకర్‌ వద్ద వైసిపి మూకలు కాపుగాచి కారుపై అటాక్‌ చేశారని గాలి భానుప్రకాష్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో టిడిపి ఉగ్రరూపం చూస్తారని, కావాలనే తన కారుపై మంత్రి ఆర్‌కె రోజా దాడి చేయించారని మండిపడ్డారు. క్షణాల్లో సమాచారం తెలుసుకున్న టిడిపి శ్రేణులు సంఘటనా స్థలానికి చేరుకుని ర్యాలీగా బయల్దేరి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. టిడిపి శ్రేణులు మంత్రి రోజా ఇంటిపై దాడిచేసేందుకు యత్నించడంతో గాలి భానుప్రకాష్‌ వారించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నగరి పట్టణంలోకి టిడిపి శ్రేణులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వందలాదిగా టిడిపి శ్రేణులు దూసుకు వచ్చి పోలీసు స్టేషన్‌ వద్ద రోడ్డుపై కూర్చుని ధర్నా నిర్వహించారు. అనంతరం సిఐకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గాలి భానుప్రకాష్‌ మాట్లాడుతూ సిగ్గులేని రోజా అభివృద్ధి చేయడం చేతగాక, తన కారుపై దాడి చేయించడం దుర్మార్గమన్నారు.