ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లను జగన్ రెడ్డి తొలగిస్తున్నాడని మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు, ఎస్‌విఎస్.వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై ప్రైవేట్ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా వైసిపి నాయకులు దరఖాస్తు చేస్తున్న ఫారం-7పై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ శుక్రవారం వారుకలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారికి వినపత్రం అందజేసారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఓటమి భయంతో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగింపు కోసం కాకినాడ జిల్లావ్యాప్తంగా 52,941, కాకినాడ సిటీ నియోజకవర్గం నుండి అత్యధికంగా 20,159 ఫారం-7 దరఖాస్తులు చేశారన్నారు. ఓటమి భయంతో కాకినాడ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకే డెస్క్ ఇంటర్నెట్ సెంటర్ కింద ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నకిలీ ఫారమ్ నెం.7 దరఖాస్తులతో కాకినాడ అర్బన్ నియోజకవర్గం యొక్క ఎన్నికల జాబితా నుండి 13000 మంది ఓటర్లను తొలగించటకు కుట్రలు పన్నుతున్నారన్నారు. సంబంధిత విషయంపై పూర్తి ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికి ఫిర్యాదు చేశారన్నారు. కాకినాడ నగరంలో ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా ఫారం-7ను దరఖాస్తు చేయిస్తున్న నేరస్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కాకినాడ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ అదనపు కమిషనర్ సహకారంతో వైసిపి నాయకులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి తప్పుడు చర్యలకు అధికారులు సహకరించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ పాల్గొన్నారు.










