Jun 07,2023 19:31

వివరాలు వెల్లడిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు హామీ మేరకు తమ గ్రూపునకే ఆదోని టికెట్‌ వస్తుందని టిడిపి నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె కృష్ణమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు మాన్వి దేవేంద్రప్ప, మైనార్టీ నాయకులు సౌదీ రావుఫ్‌ తెలిపారు. బుధవారం ఆదోని పట్టణంలోని సిటీ ప్రెస్‌ కాంపౌండ్‌లోని వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో లోకేష్‌ యువగళం యాత్ర దిగ్విజయానికి తమ వంతు సహకారం అందించామని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పని చేస్తున్నామని చెప్పారు. టిడిపి మారుతున్నారని తమపై ఆరోపణలు చేస్తున్నారని, అవి ఒట్టి పుకార్లేనని కొట్టి పారేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి నుంచి తమ గ్రూపులో ఐదుగురిలో ఎవరికిచ్చినా గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. గుడిసె కృష్ణమ్మ, మధుర భాస్కర్‌ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, సౌది రావుఫ్‌, ఫక్రుద్దీన్‌ టికెట్‌ ఆశించే వారిలో ఉన్నామన్నారు. అవసరమైతే కమ్మ వర్గానికి చెందిన వారు కూడా తమ గ్రూపులో ఉన్నారని తెలిపారు. వారికిచ్చినా అభ్యంతరం లేదన్నారు. తమ అధినేత ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో వైసిపి నాయకులకు భయం పుట్టుకుందన్నారు. ఆదోని నియోజకవర్గంలో 85 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓటర్లు ఉన్నారన్నారు. వారందరినీ సమైక్య పరిచి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రణాళిక రచిస్తామని తెలిపారు.
విత్తనాల కొరత తీర్చండి : ఖరీఫ్‌ ప్రారంభం కావస్తున్న నేపథ్యంలో పత్తి విత్తనాల కొరత తీర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు మండిపడ్డారు. పత్తి విత్తనం ప్యాకెట్‌ రూ.850 ఉండగా బ్లాక్‌లో రూ.1500లకు విక్రయిస్తున్నారన్నారు. బిల్లు మాత్రం రూ.850లకే వేస్తూ వ్యాపారులు మోసం చేస్తున్నారని వివరించారు. గతేడాది నాసిరకం పత్తి విత్తనాలు సాగు చేసి వేలాది ఎకరాల్లో లక్షలాది రూపాయలు రైతులు నష్టపోయారని తెలిపారు. రైతులు నష్టపోయిన విషయాన్ని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపలేదన్నారు. నాసిరకం కాకుండా నాణ్యమైన విత్తనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆత్మ మాజీ ఛైర్మన్‌ ఫక్రుద్దీన్‌, టిడిపి బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, మాజీ కౌన్సిలర్‌ రామచంద్రప్ప, నాయకులు మురళీ, షేక్షావలీ, రామకృష్ణ, మల్లికార్జున ఉన్నారు.