ప్రజాశక్తి-అద్దంకి: సంతమాగులూరు మండలం అడ్డరోడ్డులోని గెస్ట్ హౌస్‌లో బల్లికురవ, సంతమాగులూరు మండలాలలోని కొమ్మాలపాడు, వల్లాపల్లి, అంబడిపూడి, కొమ్మినేనివారి పాలెం గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి, అక్రమాలు, అఘాయిత్యాలే తప్ప ఉపాధి, అభివృద్ధి ఊసే లేని వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడితేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదప్రజల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ప్రణాళికలు ఉంటాయని అన్నారు. ముఖ్యంగా కుటుంబ సాధికారక సారథులు ఓటరు పేజీ నేస్తం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఓటర్ జాబితాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ అధికార వైసిపి కుతంత్రాలు, కుయుక్తులను తిప్పికొట్టాలని, ఓటర్ వెరిఫికేషన్ పక్కాగా అందరూ చేపట్టాలని, ఓట్ల చేరికలు, తొలగింపులు, డబుల్ ఎంట్రీలపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. టిడిపి సానుభూతిపరులై 18సం నిండిన యువతీ యువకులను గుర్తించి ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం బలవన్మరణం, నరసరావుపేటలో మసీదు ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడిన ముస్లిం సోదరుడిని అత్యంత దారుణంగా హత్యచేయడం, బాగా చదువుకునే మిష్బాను వేధించడంతో ఆత్మహత్య చేసుకోవడం, ఇలా వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 78 ముస్లిం మైనారిటీ కుటుంబాలపై వేధింపులకు పాల్పడ్డారని అన్నారు. ఈ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు రక్షణలేదని స్పష్టమైందన్నారు. టిడిపి హయాంలో మైనారిటీ యువతులకు దుల్హన్ పథకం ద్వారా 50 వేలు అందించామని, లక్ష రూపాయలు అందిస్తానన్న జగన్‌రెడ్డి వధూవరులు ఇద్దరికీ 10వ తరగతి నిబంధన పెట్టి లబ్ధిదారులను తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొర పథకాలున్నా పొందేందుకు వీలులేని అడ్డగోలు నిబంధనలు విధించారని అన్నారు. వైసీపీ పాలనలో ఆర్థికంగానూ, సామాజికంగానూ మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందని, టిడిపి మైనార్టీల రక్షణ, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లింపు
నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు వారికి కేటాయించిన నిధులను మళ్లించకుండా కేవలం వారికే ఉపయోగపడే విధంగా రూపొందించిన చట్టాలను టిడిపి తూచా తప్పకుండా అమలు చేసిందని, నేటి వైసిపి ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులు రూ.7,200 కోట్లు దారి మళ్లించారని అన్నారు. 11,500 ఎకరాల దళితుల అసైన్డ్ భూముల్ని బలవంతంగా లాక్కున్నారని పేర్కొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య, కులాంతర వివాహాలకు ఆర్థిక సాయం, పారిశ్రామిక రాయితీలు వంటి 28 ఎస్‌సి పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు రద్దు చేయడం దళితులకు నమ్మక ద్రోహం చేయడం కాదా అని ఆవేదన వ్యక్తం చేశారు. 1972వ సంవత్సరంలో రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలుచేశారు. లక్షలాది మంది నిరుపేద దళిత కుటుంబాలను పలు కార్యక్రమాల ద్వారా ఆదుకున్నట్లు తెలిపారు. దీంతో స్వయంశక్తితో నిరుద్యోగులు వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడగలిగారన్నారు. ఇలాంటి తోడ్పాటును అందించిన ఘనత టిడిపి హయాంలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్‌కు ఉందని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పథకాలను, కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దళారుల వద్ద ఉండిపోయిన రూ.67 కోట్లు రాబట్టడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. టిడిపి హయాంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇతర దేశాలలో విద్యను అభ్యసించేందుకు డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని అమలు చేస్తే, నేడు దానిని జగనన్న విదేశీ విద్యగా మార్చడం బలహీన వర్గాలపై జగన్‌రెడ్డి కపట ప్రేమకు నిదర్శనమని అన్నారు. దళితుల హక్కుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అంబేడ్కర్ ఆశయాలను తుంగలో తొక్కుతున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రతి ఒక్క దళితుడు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 60 వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్ చేయించి బడుగు బలహీన వర్గాలకు భూ హక్కు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే గొట్టిపాటి తెలిపారు.










