ప్రజాశక్తి - వినుకొండ : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గన్‌మెన్ షేక్.నబీ సాహెబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు శుక్రవారం తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గురువారం బొల్లాపల్లి మండలం వడ్డేంగుంటకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాన్వారు వెళ్తుండగా పట్టణంలోని కారంపూడి రోడ్డు జీవాలయం వద్దకు రాగానే టిడిపి అనుచరులు ఎమ్మెల్యే కాన్వాయిని టిడిపి నాయకులు రాపర్ల జగ్గారావు అడ్డుకున్నారని, పీవీ సురేష్, గడిపూడి విశ్వనాథం ఎమ్మెల్యే కార్‌డోర్ తీశారని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. వారితో మాట్లాడేందుకు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కారు దిగేందుకు ప్రయత్నించగా పఠాన్ ఆయుఖాన్, తోమాటి కాశీ విశ్వనాథం, నర్రా కిషోర్, వీరగంథం ప్రశాంత్, మీసాల మురళీకృష్ణ, 150-200 మంది టిడిపి అనుచరులు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పై దాడి చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేను కాపాడేందుకు గన్‌మెన్ నబీ సాహెబ్, పోలీస్ సిబ్బంది ప్రయత్నించగా కొందరు వైసిపి అనుచరులు, టిడిపి అనుచరుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుందని, టిడిపి అనుచరులు సీసాలు ఇటుకలతో రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. గన్‌మెన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ చెప్పారు.










