Oct 31,2023 23:38
దర్శిలో టిడిపి శ్రేణుల ఆనందోత్సాహాలు

ప్రజాశక్తి-దర్శి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు కోర్టు బెయిల్‌ ఇవ్వడం పట్ల టీడీపీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. స్థానిక గడియార స్తంభం సెంటర్లో బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుట్రలు పన్ని ఏసీబీ ద్వారా చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేయించారని, బెయిల్‌ ఇవ్వడం ఎంతో హర్షదాయకమని అన్నారు. చంద్రబాబునాయుడు భవిష్యత్తులో జనాల్లో ఉండి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ పిచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు యాదగిరి వాసు, నాయకులు మధు, స్టీవెన్‌, న్యాయవాది రంగా, శాగం కొండారెడ్డి, గొర్రె సుబ్బారెడ్డి, శోభారాణి, మునగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సిఎస్‌పురం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన సందర్భంగా సిఎస్‌ పురంలో టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంగయ్య ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం ముందు బాణాసంచా పేల్చారు. స్వీట్స్‌ పంచారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాలకొండయ్య, షేక్‌ అబ్దుల్లా, మన్నేపల్లి శ్రీనివాసులు, రామకృష్ణంరాజు, ముప్పాళ్ల నరసింహరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హనుమంతునిపాడు: స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్‌ కేసులో న్యాయం గెలిచిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మధ్యంతర బెయిల్‌ రావడమే అందుకు నిదర్శనమని హనుమంతునిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు మధ్యంతర బెయిల్‌ వచ్చిన సందర్భంగా, హనుమంతునిపాడు మండల పార్టీ అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో హనుమంతునిపాడు మండల కేంద్రంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మురారి నరసయ్య, గాయం రామిరెడ్డి, చీకటి వెంకటసుబ్బయ్య, సానికొమ్ము బ్రహ్మారెడ్డి, కందుల వెంకట సుబ్బారెడ్డి, బలసాని కోటయ్య, కూడలి దశరథ, గంటా శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పామూరు: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సందర్భంగా పామూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచుకొని, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు పువ్వాడ వెంకటేశ్వర్లు, బొల్లా నరసింహ చౌదరి, ఇర్రి కోటిరెడ్డి, డి మాల్యాద్రి, వీరబాబు, గౌస్‌బాషా, ఎస్‌కె రహంతుల్లా, మౌలాలి, అమీర్‌బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొండపి: టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు బెయిల్‌ మంజూరు కావడంతో కొండపి మండలంలోని తెలుగు తమ్ముళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. కొండపిలోని ఎన్టీఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండపిలోని కామేపల్లి రోడ్డులో, ఎన్టీఆర్‌ సర్కిల్‌లో బాణసంచాతో మారుమోగించారు. న్యాయం గెలిచింది అంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మర్రిపూడి: చంద్రబాబుకు బెయిల్‌ రావడంతో మర్రిపూడి మండలంలోని తెలుగు తమ్ముళ్లు, నాయకులు, యువత, కార్యకర్తలు సంబరాలు మిన్నంటాయి. మర్రిపూడి అన్ని గ్రామాలలో బాణసంచా కార్యక్రమం నిర్వహించారు. న్యాయం గెలిచింది అంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పీసీ పల్లి: చంద్రబాబు నాయుడు బెయిల్‌పై విడుదలైన సందర్భంగా పిసి పల్లి, వెంగళాయపల్లిలో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకొని స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల పార్టీ అధ్యక్షులు వేమూరి రామయ్య మాట్లాడుతూ ఎప్పటికైనా నిజం గెలుస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు, రాజకీయ కుట్రలో భాగంగానే చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కరణం గంగయ్య, కరణం వెంకటేశ్వర్లు, ఐటిడిపి నాయకులు మూలే సత్తిరెడ్డి, బోయపాటి సుబ్బారావు, టిడిపి యూత్‌ నాయకులు ఏనుగంటి నాగేంద్రబాబు, వీరపనేని పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు.