ప్రజాశక్తి- దేవరాపల్లి
టిడిపి అధినేత చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు కందుకూరు మృతులకు తీవ్ర సంతాపం తెలిపి, మౌనం పాటించారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని లేని రాష్ట్రానికి ఇదేమి కర్మ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రామానాయుడు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు చంద్రబాబు అని తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, వైసిపి నుంచి ప్రజలు రక్షించబడాలంటే 2024 ఎన్నికల్లో టిడిపిని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ఒకటే మార్గమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్ష, కార్యదర్శులు చిటిమిరెడ్డి సూర్యనారాయణ, శరకాన సూర్యనారాయణ, పెద్దాడ వెంకటరమణ, పూడి సత్యారావు, సోమిరెడ్డి గోవింద తదితరులు పాల్గొన్నారు.










