Oct 28,2022 23:23

ఆందోళన చేపడుతున్న కిడారి, నాయకులు

ప్రజాశక్తి-పాడేరు: ఉత్తరాంధ్ర సమస్యలపై టిడిపి నిరసనలకు పిలుపునిస్తే అధికార పార్టీ ఎందుకు భయపడుతోందని మాజీమంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. శుక్రవారం విశాఖలో టిడిపి ఆధ్వర్యంలో తలపెట్టిన పోరుబాట నేపథ్యంలో అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు పలువురు టిడిపి నాయకులను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి గంగ పూజారి శివకుమార్‌, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకటసురేష్‌ కుమార్‌, రాష్ట్ర ఎస్‌ టి సెల్‌ కార్యదర్శి గబ్బాడ సింహాచలంతో సహా పలువురు నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పాడేరులోని తన నివాసంలో టిడిపి నాయకులతో కలసి మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ రుషికొండలో తవ్వకాలు, అక్రమ కట్టడాలు, దసపల్లా భూములు, ప్రభుత్వ, పేదల స్థలాల ఆక్రమణ తదితర అంశాలపై టిడిపి ఆందోళనలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పలువురు టిడిపి నేతల గహనిర్బంధాలు దారుణమన్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సాగర సుబ్బారావు, బాకూరు వెంకటరమణరాజు, తామర్ల సత్యనారయణ, సాగర సత్యవతి, పాంగి పాండురంగ స్వామి, పాడి బాలన్న, సోమెలి లక్ష్మయ్య, సూర్యకాంతం, కొర్ర నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
నిర్బంధంతో ఉద్యమాలను ఆపలేరు
టిడిపి ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు దొన్నుదొర
ప్రజాశక్తి-హుకుంపేట:నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర తెలిపారు. రుషికొండపై ఆందోళనకు బయలు దేరిన దొన్నుదొర, మండల నాయకులకు, ఉప సర్పంచ్‌లను శుక్రవారం తన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల అక్రమ నిర్బంధాన్ని దొన్నుదొర తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో కొనసాగుతున్నామా అనే సందేహం వ్యక్తమవుతుందని ఆయన అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారని రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ఏమైనా అమలవుతుందా అని దొన్నుదొర ప్రశ్నించారు. ప్రజల గొంతు నొక్కలేరని దుయ్యబట్టారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న చేదు అనుభవాలే దీనికి సాక్ష్యం అని తెలిపారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్‌ విజయ నిర్మల, చందు, సీనియర్‌ నాయకులు రాము, సుబ్బారావు, అర్జున్‌, బలరాం, బాలు దొర, మధు దొర, సంతోష్‌, శ్యామ్‌, ముత్య్సరాజు పాల్గొన్నారు.