Oct 09,2023 21:36

పోలీసులతో నాయకుల వాగ్వాదం

ప్రజాశక్తి-హిందూపురం : టిడిపి అధినేత చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా సోమవారం పట్టణంలో కురుబ సామాజిక వర్గ నేతలు వారి సాంప్రదాయ పద్ధతిలో గొరవయ్యల వేషాధారణలో ర్యాలీ చేపట్టారు. అందుకు ఆగ్రహించిన పోలీసులు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో కురుబలు చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకొంది. బాలకృష్ణన్‌ కూడలి నుంచి ర్యాలీగా బయలు దేరిన కురుబలు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని కనకదాసు విగ్రహం వద్దకు చేరుకొంటుండగా వన్‌ టౌన్‌ సిఐ శ్రీనివాసులు అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా టిడిపి హిందూపురం పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ సిఐతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అంబికాతో పాటు మరో 10 మంది ముఖ్య నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తు వన్‌ టౌన్‌ స్టేషన్‌ను ముట్టడించటంతో ఉద్రిక్తతకు దారితీసింది. అంబికా లక్ష్మీనారాయణను విడుదలచేయాలని నినాదాలు చేశారు. సిఐతో న్యాయవాది శివశంకర్‌, తెదేపా రాష్ట్ర కార్యదర్శి కొలకుంట అంజనప్ప పట్టణ పార్టీ అధ్యక్షులు డీఈ రమేష్‌ కుమార్‌, పార్టీ నాయకులు చర్చలు జరిపారు. అంబికా లక్ష్మీనారాయణను వదిలివేయటానికి సమ్మతించటంతో సంఘటన సుఖాంతమైంది. దీనికన్న ముందు దీక్షా శిబిరంలో జరిగిన దీక్షలో పార్లమెంట్‌ అధ్యక్షులు పార్థసారథి పాల్గొన్నారు. అనంతరం కురువలు, నాయకులు చెవులో పూలు పెట్టుకుని నోటికి రిబ్బన్‌ కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ ఐటిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు కురుబ రామాంజనేయులు, రాష్ట్ర తెలుగు మహిళ కార్యదర్శి పరిమళ, మాజీ ఎంపీపీ ఆనంద్‌ కుమార్‌, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు మాలక్క, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు అభి, నాయకులు కురుబ కిష్టప్ప, కమటం వెంకటేష్‌, నాగరాజు, కొల్లకుంట అనిల్‌, హనుమంతరాయుడు తదితరులు పాల్గొన్నారు.