Aug 05,2023 07:56

చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా టిడిపి నాయకులు

        కదిరి టౌన్‌ : సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు చేపట్టిన యుద్ధభేరి యాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగిసింది. గురువారం నాడు ఆత్మకూరు, పెనుకొండ, కదిరి ప్రాంతాల్లో పర్యటించారు. గురువారం రాత్రి కదిరి నియోజకవర్గం కొక్కంటి క్రాస్‌ సమీపంలోని పోలం సిద్ధారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం విడిది కేంద్రంలో ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితులపై చర్చించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ భవిష్యత్తులో పార్టీ అనుసరించిన విధానాలపై దిశానిర్ధేశం చేశారు. పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేలా నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల టిడిపి అధ్యక్షులు బికె.పార్థసారథి, కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కందికుంట వెంకటప్రసాద్‌, పరిటాల శ్రీరామ్‌, మాదినేని ఉమామహేశ్వర నాయుడు, వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, జితేంద్రగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.