రాయదుర్గం : రాష్ట్రంలో జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలవపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఇటీవల నాలుగు కేసులు నమోదు అయ్యాయి. తనపై అక్రమంగా ఈ కేసులు ఎందుకు బనాయించారో తెలుసుకోవాలని కాలవ అనంతపురం నుంచి రాయదుర్గం వెళ్లేందుకు మంగళవారం సిద్ధం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అనంతపురంలోని ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కాలవను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారు. ఉదయం 10 గంటలకు కాలవ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు కాలవ శ్రీనిసులకు మధ్య తోపులాట జరిగింది. బలవంతంగా పోలీసులు కాలవను గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన తన నివాసం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండిస్తూ తాము రాయదుర్గంలో శాంతియుతంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టామన్నారు. ప్రజల నుంచి టిడిపికి వస్తున్న మద్దతును చూసి ఓర్చుకోలేక పోలీసులు తమపై అక్రమ కేసులు బనాయించారన్నారు. అక్కడ దీక్షలు జరగకుండా శిబిరాన్ని బలవంతంగా ఎత్తేయించారని చెప్పారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నా తప్పుడు కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పోలీసులు వైసిపి వారికి ఒకలా, టిడిపి వారికి ఒకలా చట్టాన్ని అమలు చేయడం దుర్మార్గంగా ఉందన్నారు. అక్రమ కేసులు, కక్షసాధింపుల ద్వారా జగన్మోహన్‌రెడ్డి ఏమీ సాధించలేరన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. త్వరలోనే వీరికి గుణపాఠం చెప్పే రోజు వస్తుందని కాలవ హెచ్చరించారు.










