Feb 21,2023 22:45

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: గన్నవరం వెళ్లేందుకు బయలుదేరిన బుద్దా వెంకన్నను ఆయన ఇంటివద్ద వన్‌టౌన్‌ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై వెంకన్న బైఠాయించారు. ఈ సందర్బంగా బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలు కర్రలు జెండాల కోసం వాడుతున్నామని, వైసీపీ కార్యకర్తలు విధ్వంసానికి వాడుతున్నారని విమర్శించారు. ప్రజాశక్తి-కంచికచర్ల: గన్నవరంకు బయల్దేరిన టిడిపి నాయకులను స్థానిక పార్టీ కార్యాలయం నుండి బయటకు వెళ్లనీయకుండా కంచికచర్ల పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మండల టిడిపి అధ్యక్షుడు కోగంటి బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ప్రజాశక్తి-తిరువూరు: గన్నవరంలో టిడిపి కార్యాలయంపై జరిగిన దాడిని నిరసనగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరువూరు బోసుబోమ్మ సెంటర్‌లో మంగళవారం చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ శావల దేవదత్తు, టిడిపి పట్టణ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్‌ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ప్రజాశక్తి-విజయవాడ రూరల్‌: గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పట్టాభిని వెంటనే విడుదల చేయాలని, ఎమ్మెల్యే వంశీ, అతని అనుచరులపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాశక్తి-జగ్గయ్యపేట: నెట్టెం శివరాం, శ్రీరామ్‌ ధనుంజయ (చినబాబు) ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద టిడిపి నాయకులు నిరసన తెలిపారు.