Aug 31,2023 23:42

కృష్ణదాస్‌, వైసిపి జిల్లా అధ్యక్షులు

* ఉచితం పేరుతో రూ.4 వేల కోట్లు దోచుకున్నారు
* అడ్డుకున్న అధికారులను కొట్టిన చరిత్ర వాళ్లదే
* వైసిపి జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్‌
ప్రజాశక్తి- నరసన్నపేట: 
ప్రజలకు అత్యంత పారదర్శకంగా, అందుబాటు ధరలో ఇసుకను అందజేస్తున్న తమ ప్రభుత్వంపై టిడిపి నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ... టిడిపి హయాంలో ఆ పార్టీ నాయకులు రూ.4 వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వారి హయాంలో ఇసుక ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో చెప్పలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అసలైన ఇసుకాసురులు వారేనని విమర్శించారు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వనజాక్షి అనే తహశీల్దార్‌ను జుట్టు పట్టుకొని కొట్టిన చరిత్ర వారికే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా తమ ప్రభుత్వం ఇసుక టెండర్ల ప్రక్రియను నిర్వహించి ఏటా ప్రభుత్వానికి రూ.760 కోట్ల ఆదాయాన్ని తీసుకు వస్తున్నదని స్పష్టం చేశారు. ప్రత్యేకమైన టోల్‌ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసి ఇసుక విధానంలో ఎలాంటి లోపాలు ఉన్నా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. సెబ్‌ లాంటి నిఘా వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఒక ఐపిఎస్‌ అధికారిని నియమించి ఎక్కడా అక్రమాలు జరగకుండా చూస్తున్న తమ ప్రభుత్వంపై నిందారోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.