ప్రజాశక్తి-పాడేరు టౌన్: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వద్ద టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పాత బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వారంతా చేరుకుని ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ, చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వ లేకనే వైసిపి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకోవాలని యత్నిస్తోందని విమర్శించారు. వైసిపి ప్రజావ్యతిరేక, నిరంకుశ పాలనపై విసిగిపోయిన ఓటర్లు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఎపిలో వైసిపి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని, నియంత పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.సింహాచలం, బి.జ్యోతికిరణ్, బి.జగదీష్, డి.విశ్వనాధం, కె.శివశంకర్, డి.వెంకటరమణ, కె.కోటిబాబు, శ్రీను, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.










