Sep 27,2023 21:34

ఫొటో : దీక్ష చేపడుతున్న టిడిపి నాయకులు

టిడిపి నాయకుల రిలే దీక్ష
ప్రజాశక్తి-కావలి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా, నియోజకవర్గ టిడిపి కార్యాలయం వద్ద ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో కాపు సంఘ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గంలోని పార్టీ కుటుంబ సభ్యులందరూ బుధవారం 14వ రోజు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. దీక్ష శిబిరంలో ముందుగా సుబ్బానాయుడు మాట్లాడుతూ 45సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడును అక్రమంగా అవినీతి చేశారంటూ ఆరోపిస్తూ, అరెస్టు చేయడం చాలా దౌర్భాగ్యమన్నారు.
ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో టిడిపి నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులు బనాయించి, హింసించడమే లక్ష్యంగా జగన్‌ మొండి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతటికీ ప్రతిఫలంగా జగన్‌కు జీవితకాలం జైలు ఖాయమని హెచ్చరించారు. దీక్షలో పాల్గొన్న నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బొమ్మి సురేంద్ర మాట్లాడుతూ సంక్షేమం అంటే గుర్తొచ్చేది టిడిపినే అని అన్నారు. కాపులకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.1000 కోట్లు మంజూరు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు. అలాగే 5శాతం రిజర్వేషన్‌ కల్పించారని, ఇప్పటి వైసిపి ప్రభుత్వం ఆ 5శాతం క్యాన్సిల్‌ చేసిందని తెలియజేశారు. ఒక్క కాపులకే కాకుండా అన్నివర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించిన ఘనత టిడిపిదే అని అన్నారు. ప్రస్తుతం కక్ష ధోరణితో జరుగుతున్న కార్యక్రమాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, వీటిని ఖండించే సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలుపునిచ్చారు. తదుపరి రాష్ట్ర టిడిపి కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంబంధం లేని కేసులో చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ సంఘటనకు తప్పకుండా జగన్‌కు రిటన్‌ గిఫ్ట్‌ ఉంటుందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మరొక బీహార్‌గా మారుస్తున్న సిఎంకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. తిరిగి లోకేష్‌బాబు యువగళం పాదయాత్రను మొదలు పెడుతున్న విషయాన్ని జీర్ణించుకోలేక, లోకేష్‌బాబుపై కుట్ర పన్నుతున్నారని తెలిపారు. ఎంతమందిని అరెస్టు చేసినా బంతిలా పైకి లేచి వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. టిడిపికి సంక్షోభాలు కొత్తవి కాదని, ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కాక కావలి నియోజకవర్గంలో చూస్తే కాపులను అభివృద్ధి చేసిన ఘనత టిడిపిదే అని పేర్లతో సహా వివరించారు. స్థానిక ఎంఎల్‌ఎ కాపులకు చేసిందేమీ లేదని, కావలి నియోజకవర్గంలో ఎంతోమంది ఎంఎల్‌ఎలు పనిచేశారని, కేవలం సంపాదనే ధ్యేయంగా పనిచేసిన ఎంఎల్‌ఎ రామిరెడ్డి అని ధ్వజమెత్తారు. ఎంఎల్‌ఎ ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు. ఈ దీక్షకు సంఘీభావంగా ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ నాయుడు, అనేకమంది కాపు నాయకులు కదలి వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై సంతకాలు చేసి కార్యక్రమాన్ని ముగించారు.